Vicky Kaushal: ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో గతంలో ‘డంకీ’ మూవీలో నటించాడు విక్కీ కౌశల్. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఓ మూవీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవాళ బాలీవుడ్ లోని యువ హీరోలలో విక్కీ కౌశల్ కు మంచి గుర్తింపే ఉంది. అతని సినిమాలకూ మంచి క్రేజ్ ఏర్పడుతోంది. విక్కీ కౌశల్ కొత్త సినిమా ‘ఛావా’ వచ్చే యేడాది ప్రారంభంలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’లో విక్కీ నటించాల్సి ఉంది. అలానే అమర్ కౌశిక్ మూవీ ‘మహావతార్’కూ విక్కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ పౌరాణిక చిత్రంలో అతను పరశురాముడిగా నటిస్తున్నాడు. ఇది 2026 క్రిస్మస్ కు వస్తుంది. ఇదిలా ఉంటే… రాజ్ కుమార్ హిరానీ తాను రాసుకుంటున్న స్క్రిప్ట్ కు విక్కీ కౌశిక్ నే హీరోగా అనుకుంటున్నాడట. ప్రాధమిక చర్చల అనంతరం విక్కీ సైతం తన అంగీకారాన్ని తెలిపాడని అంటున్నారు. ‘మహావతార్’ షూటింగ్ పూర్తి కాగానే విక్కీ చేసే సినిమా ఇదే అని తెలుస్తోంది.