AP Rains: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళి పోటెత్తుతున్నాయి. గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఆనకట్టలు, బ్యారేజీల వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), జిల్లా యంత్రాంగం నదీ పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశాయి.
ప్రాజెక్టుల వద్ద వరద తాజా పరిస్థితి..
నారాయణపురం ఆనకట్ట (నాగావళి నది)
వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా 76,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
తోటపల్లి బ్యారేజ్ (నాగావళి నది)
తోటపల్లి వద్దకు 24,639 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు 23,250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గొట్టా బ్యారేజ్ (వంశధార నది)
ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్దకు 43,860 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. గేట్లు ఎత్తి 46,197 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు – మార్గదర్శకాలు..
పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముందస్తు సహాయక చర్యల కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్న కాజ్‌వేలు, వంతెనల మీదుగా రాకపోకలు సాగించరాదు. వరద నీరు చూడటానికి వెళ్లడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టేందుకు ప్రయత్నించడం ప్రాణాంతకమని హెచ్చరించారు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల తీవ్రమైన సుడులు, ప్రవాహ వేగం ఉంటాయని స్పష్టం చేశారు. చిన్నపిల్లలను నదులు, చెరువులు, కాల్వల సమీపానికి వెళ్లకుండా తల్లిదండ్రులు కచ్చితంగా పర్యవేక్షించాలి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
నదుల తీరప్రాంత ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని యంత్రాంగం కోరింది.
