US Tariffs

US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?

US Tariffs: అంతర్జాతీయ వాణిజ్యంలో (Global Trade) మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. వెట్టిచాకిరి లేదా బలవంతపు శ్రమ (Forced Labour) ఆందోళనలను సరైన పద్ధతిలో పరిష్కరించడంలో విఫలమయ్యాయని భావిస్తున్న దేశాల నుండి వచ్చే దిగుమతులపై గరిష్టంగా 12.5% వరకు అదనపు సుంకాలు (Tariffs) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. వాషింగ్టన్ సిద్ధం చేసిన ఈ సరికొత్త టారిఫ్ ముప్పును ఎదుర్కోబోయే 60 ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం ఇంకా చైనా కూడా ప్రముఖంగా ఉన్నాయి.

అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం ప్రకటించిన ఈ ప్రతిపాదిత చర్య.. ‘యూఎస్ ట్రేడ్ యాక్ట్ 1974’ లోని ‘సెక్షన్ 301’ కిందకు వస్తుంది. గతంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో చైనా దిగుమతులపై వందల బిలియన్ల డాలర్ల పన్నులు విధించడానికి కూడా ఇదే చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఒకవేళ ఇది గనుక అధికారికంగా అమల్లోకి వస్తే.. అమెరికాలోకి వచ్చే విస్తృత శ్రేణి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా, భారత్-అమెరికా మధ్య ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం (Trade Deal) కోసం జూన్ 2 నుండి జూన్ 4 వరకు చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం.

అమెరికా ప్రతిపాదిస్తున్న పన్నుల విధింపు ఎలా ఉండబోతోంది?

భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు పలు ఆగ్నేయాసియా దేశాలతో కలిపి మొత్తం 60 ఆర్థిక వ్యవస్థల నుండి వచ్చే దిగుమతులపై గరిష్టంగా 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలని USTR ప్రతిపాదించింది.

USTR నివేదిక ప్రకారం.. ఈ ప్రభావానికి గురయ్యే దేశాలు వెట్టిచాకిరితో తయారయ్యే వస్తువులపై ఆంక్షలు విధించడంలో గానీ లేదా ప్రస్తుతం ఉన్న నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో గానీ విఫలమయ్యాయి. ఈ ప్రతిపాదనలో దేశాలను రెండు కేటగిరీలుగా విభజించారు.

  • 10% టారిఫ్: వెట్టిచాకిరితో ముడిపడి ఉన్న దిగుమతులపై పూర్తి లేదా పాక్షికంగా చట్టపరమైన నిషేధాన్ని విధించినప్పటికీ, అమలులో వెనుకబడిన దేశాలు 10% సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

  • 12.5% టారిఫ్: అసలు అలాంటి నిషేధాలనే తమ దేశాల్లో అమలు చేయని దేశాలు 12.5% చొప్పున అంతకంటే ఎక్కువ సుంకాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.

యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ.. ప్రధాన వాణిజ్య భాగస్వాములు వెట్టిచాకిరితో ముడిపడి ఉన్న దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అమెరికన్ కార్మికులకు అంతర్జాతీయ మార్కెట్లో సమాన అవకాశాలు (Uneven playing field) లభించడం లేదని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

భారత్, చైనాలను ఎందుకు టార్గెట్ చేశారు?

USTR అన్వేషణల ప్రకారం.. వెట్టిచాకిరితో ముడిపడి ఉన్న వస్తువులపై చట్టపరమైన నిషేధాన్ని విధించడంలో  ఉన్న ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనట్లు తేలిన 54 ఆర్థిక వ్యవస్థల అత్యంత నెగెటివ్ కేటగిరీలో భారత్, చైనా కూడా ఉన్నాయి.

భారతదేశంపై ఇచ్చిన నివేదికలో USTR మాట్లాడుతూ.. దేశం “వెట్టిచాకిరి దిగుమతుల నిషేధాన్ని విధించడంలో మరియు సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైంది” అని పేర్కొంది. దీనివల్ల భారతదేశ విధానాలు పద్ధతులు అమెరికా వాణిజ్యానికి (US Commerce) భారం కలిగిస్తున్నాయని లేదా పరిమితం చేస్తున్నాయని నిర్ధారించింది. వెట్టిచాకిరిని ఉపయోగించి తయారు చేసే వస్తువులు చాలా తక్కువ ఖర్చుతో గ్లోబల్ సప్లై చైన్‌లలోకి ప్రవేశిస్తాయని, దీనివల్ల కఠినమైన కార్మిక ప్రమాణాలను అమలు చేసే దేశాలలోని వ్యాపారాలకు ఇది అన్యాయమైన పోటీని (Unfair competition) సృష్టిస్తుందని USTR వాదిస్తోంది.

అసలు ఏంటి ఈ ‘సెక్షన్ 301’?

యూఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301.. విదేశీ వాణిజ్య పద్ధతులపై దర్యాప్తు చేయడానికి ఆ పద్ధతులు అమెరికన్ వాణిజ్యానికి హానికరం అని తేలితే వారిపై ప్రతీకార చర్యలుగా భారీ సుంకాలు విధించడానికి అమెరికా ప్రభుత్వానికి పూర్తి చట్టపరమైన అధికారాలను ఇస్తుంది.

తాజా దర్యాప్తులు 2026 మార్చి 12న ప్రారంభమయ్యాయి. మొత్తం అమెరికా దిగుమతులలో దాదాపు 99.4% వాటా కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఇవి కవర్ చేశాయి. పూర్తిగా లేదా పాక్షికంగా వెట్టిచాకిరిని ఉపయోగించి ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిషేధించడంలో ప్రభుత్వాలు ఏ మేరకు విఫలమయ్యాయనే కోణంలో ఈ సుదీర్ఘ దర్యాప్తులు జరిగాయి.

టార్గెట్ లిస్ట్‌లో ఉన్న ఇతర ప్రముఖ దేశాలు.

భారతదేశం, చైనా మాత్రమే కాకుండా ఈ జాబితాలో యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్, కెనడా, మెక్సికో మరియు పలు గల్ఫ్ దేశాలు ఉన్నాయి.

అయితే, ఈ ప్రతిపాదన ఇంకా ఖరారు కాలేదు. ఎలాంటి సుంకాలను అధికారికంగా అమలు చేయడానికి ముందైనా.. ఈ సిఫార్సులపై మరింత సమీక్ష మరియు అంతర్జాతీయ సంప్రదింపులు జరుగుతాయని USTR పేర్కొంది. ఒకవేళ ఈ సెక్షన్ 301 టారిఫ్‌లు గనుక అమల్లోకి వస్తే, అమెరికా వాణిజ్య విధానంలో కార్మిక ప్రమాణాలు అత్యంత కీలకమైన భాగంగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది. ఇది భారత్, చైనాతో సహా ఆసియా అంతటా ఉన్న ఎగుమతిదారులపై (Exporters) సుదూర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *