Suicide: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ‘హోమ్ ల్యాండ్’ సంస్థ అధినేత బాణాల రామ్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌హౌస్)లో ఆయన ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామ్‌రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
పటాన్చెరు భారీ వెంచర్ – లిటిగేషన్లలో చిక్కులు..
హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్న రామ్‌రెడ్డి, 2018లో పటాన్చెరు ప్రాంతంలో దాదాపు 250 నుంచి 280 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ అభివృద్ధి కోసం భూమిని తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించి ఊహించని వివాదాలు, లిటిగేషన్లు తలెత్తడంతో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బాగా ఆలస్యమైంది. ఈ వివాదాలను పరిష్కరించే క్రమంలో ఆయన భారీగా అప్పులు చేసినట్లు, మరోవైపు భూ యజమానులతోనూ సమస్యలు ముదిరినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు సంబంధించి కొందరు స్థానిక రాజకీయ నాయకుల నుంచి కూడా రామ్రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక భారం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేకనే ఆయన తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం..
కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో ఆయన ఎవరి పేర్లనైనా ప్రస్తావించారా? ఎవరివల్ల ఆయన ఒత్తిడికి గురయ్యారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.పంచనామా అనంతరం రామ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం రియల్ ఎస్టేట్, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.
