Nvidia: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ప్రముఖ అమెరికన్ సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) చుట్టూ అంతర్జాతీయ గూఢచర్యం, అక్రమ చిప్ రవాణా వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో చైనాపై విధించిన అధునాతన ఏఐ చిప్‌ల ఎగుమతి ఆంక్షలను బైపాస్ చేస్తూ, ఆగ్నేయాసియా దేశాల ద్వారా భారీ ఎత్తున చిప్‌లను చైనాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.
ఈ వ్యవహారంలో ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ సన్నిహితురాలిగా భావిస్తున్న చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ (హువాంగ్ లే) ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని ది న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది.
ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎలా వెలుగులోకి వచ్చింది?
ఆలిస్ హువాంగ్ (చైనా పేరు.. హువాంగ్ లే) చైనా పౌరురాలు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్ (Megaspeed)లో ఈమె సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు (ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో ఈమెకు ఎలాంటి రక్తసంబంధం లేదు).
ఎన్విడియా నుంచి హై-ఎండ్ ఏఐ చిప్‌లు, అత్యాధునిక కంప్యూటింగ్ పరికరాలను కొనుగోలు చేసి, ఆ డేటా సెంటర్ సామర్థ్యాలను థర్డ్ పార్టీ క్లయింట్లకు అద్దెకు ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. చైనా టెక్ దిగ్గజం అలీబాబా వంటి సంస్థలు కూడా మెగాస్పీడ్ సర్వీసులను వినియోగిస్తున్నట్లు సమాచారం.
అమెరికా ఆంక్షల వల్ల చైనా కంపెనీలు నేరుగా కొనుగోలు చేయలేని అత్యాధునిక ఎన్విడియా చిప్‌లను సింగపూర్, మలేషియా కేంద్రాలుగా ఉన్న నెట్వర్క్ ద్వారా సమకూరుస్తున్నట్లు యూఎస్ అధికారులు అనుమానిస్తున్నారు.
$4.8 బిలియన్ల కొనుగోళ్లు.. బాక్సుల్లోనే ఎన్విడియా చిప్‌లు!
మెగాస్పీడ్పై అమెరికా వాణిజ్య శాఖ పరిశీలన 2024 నుంచే మొదలైంది. మలేషియాలోని మెగాస్పీడ్ డేటా సెంటర్‌ను పరిశీలించిన యూఎస్ అధికారి ఒకరు.. ఎన్విడియా అధునాతన పరికరాలు డేటా సెంటర్లలో ఇన్స్టాల్ కాకుండా ఇంకా బాక్సుల్లోనే ప్యాక్ చేసి ఉండటాన్ని గుర్తించారు. అవి స్థానిక డేటా సెంటర్ల కోసమా లేక గుట్టుచప్పుడు కాకుండా చైనాకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేశారా అనే అనుమానాలు బలపడ్డాయి.
ట్రేడ్ రికార్డుల ప్రకారం.. జూన్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో మెగాస్పీడ్ అనుబంధ మలేషియా కంపెనీ ఏకంగా 4.8 బిలియన్ డాలర్ల (సుమారు ₹40 వేల కోట్లకు పైగా) విలువైన ఎన్విడియా ఏఐ పరికరాలను కొనుగోలు చేసింది.
2025లో సింగపూర్ అధికారులు ఆలిస్ హువాంగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత విడుదల చేశారు. మొదట వాణిజ్య శాఖ పరిధిలో ఉన్న ఈ విచారణను, భద్రతా కారణాల రీత్యా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ)కు బదిలీ చేసినట్లు సమాచారం.
జెన్సన్ హువాంగ్‌తో సంబంధాలు.. బయటపడింది ఇలా!
ఈ కేసుకు మరింత సున్నితత్వాన్ని తెచ్చిపెట్టింది ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్‌కు ఉన్న ప్రత్యక్ష పరిచయాలే. చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆలిస్ హువాంగ్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది.
ఈ నిఘా క్రమంలో ఓ అమెరికన్ పౌరుడితో ఆమె జరిపిన సంభాషణలను అధికారులు గుర్తించారు. నిఘా నిబంధనల ప్రకారం ‘అన్మాస్కింగ్’ ప్రక్రియ ద్వారా సదరు అమెరికన్ వ్యక్తి ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ అని తేలింది.
జూన్ 2024లో తైపీలో జరిగిన టెక్ ట్రేడ్ షో అనంతరం ఓ బార్లో జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ కలిసి కూర్చున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మే 2025లో కూడా తైపీలోని ఓ రెస్టారెంట్ నుంచి వీరిద్దరూ కలిసి బయటకు వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి.
వైట్‌హౌస్, యూఎస్ అధికారుల్లో ఆందోళన ఎందుకు?
జెన్సన్ హువాంగ్ అమెరికా ఏఐ రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి. చైనాతో సాంకేతిక ఆధిపత్య పోటీలో అమెరికాకు ఎన్విడియా చిప్లే ప్రధాన ఆయుధాలు. ట్రంప్ అధికార యంత్రాంగానికి కూడా టెక్నాలజీ, జాతీయ భద్రత అంశాల్లో హువాంగ్ కీలక సలహాదారుగా ఉన్నారు.
ఆలిస్ హువాంగ్ ద్వారా ఎన్విడియా భవిష్యత్ వ్యాపార రహస్యాలు, లేదా చిప్ ఎగుమతులపై ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచనా ధోరణికి సంబంధించిన సమాచారం బీజింగ్‌కు చేరి ఉండొచ్చా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.అయితే, ఈమె బీజింగ్ కోసం పనిచేస్తోందనే విషయం జెన్సన్ హువాంగ్‌కు తెలిసి ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఎన్విడియా, మెగాస్పీడ్ స్పందన
ఈ ఆరోపణలను ఎన్విడియా తీవ్రంగా తోసిపుచ్చింది. ఎన్విడియా అధికార ప్రతినిధి జాన్ రిజ్జో మాట్లాడుతూ.. “కస్టమర్లను కలవడం సీఈవో విధుల్లో సాధారణ భాగం. జెన్సన్ ఏటా వేలాది మంది క్లయింట్లతో భేటీ అవుతుంటారు. ఆలిస్ హువాంగ్‌తో భేటీ అసాధారణమైనదేమీ కాదు” అని స్పష్టం చేశారు.
మెగాస్పీడ్ వంటి ప్రాంతీయ క్లౌడ్ కస్టమర్లకు సాధారణ వ్యాపార సమాచారం మాత్రమే అందుతుందని, కంపెనీ వాణిజ్య రహస్యాలు గానీ, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారం గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ చేరలేదని ఎన్విడియా స్పష్టం చేసింది.
మెగాస్పీడ్ సైతం ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు యూఎస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఆలిస్ హువాంగ్‌తో పాటు ఆగ్నేయాసియా కేంద్రంగా సాగుతున్న డమ్మీ కంపెనీల నెట్‌వర్క్‌పై అమెరికా దర్యాప్తు కొనసాగుతోంది. చైనా-అమెరికా టెక్ వార్‌లో ఈ వ్యవహారం సరికొత్త రాజకీయ దుమారానికి దారితీస్తోంది.
