Manmadha Re-Release: సినీ ప్రియులను అలరిస్తున్న ‘రీ-రిలీజ్’ ట్రెండ్‌లో మరో క్రేజీ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తమిళ స్టార్ హీరో శింబు, జ్యోతిక జంటగా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను ఈనెల జూలై 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (నైజాం) వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఈ చిత్రం 2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత తెలుగులో ‘మన్మధ’ పేరుతో వచ్చి ఇక్కడి యువతను కూడా ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో శింబు నటన, సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే కథ, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు అప్పట్లో పిచ్చెక్కించాయి. అందుకే ఇప్పటికీ ఈ సినిమాకు టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాత హిట్ సినిమాల రీ-రిలీజ్‌లకు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ ఫేవరెట్ సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న ‘మన్మధ’ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించగా.. హీరో శింబు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
