UPI Payments

UPI: దివాళీ తర్వాతే కొత్త రూల్స్.. యూపీఐ యూజర్లకు, వ్యాపారులకు భారీ ఊరట..!

UPI: దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే చిరు వ్యాపారులు, వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీపి కబురు అందించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) కొత్త నిబంధనలను దీపావళి ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 13న ఎన్‌పీసీఐ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ.. ప్రస్తుతానికి యూపీఐ లావాదేవీలపై ఎలాంటి కొత్త చార్జీలు వర్తించవని స్పష్టం చేసింది. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ చార్జీని విధించేందుకు ఏర్పాట్లు జరగ్గా, గురువారం నుంచి అమలు కావాల్సిన ఈ నిర్ణయాన్ని పండుగ సీజన్ దృష్ట్యా తాత్కాలికంగా పక్కనపెట్టారు.
పండుగ సీజన్‌లో వ్యాపారులకు ఊరట..
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ఎన్‌పీసీఐ.. పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై అమలు చేయాలనుకున్న చార్జీలను నిలిపివేయడానికి ప్రధాన కారణాలను వివరించింది.
వ్యాపారాలు, కస్టమర్లపై ప్రభావం పడకుండా..
దసరా, దీపావళి షాపింగ్ సీజన్‌లో ఈ చార్జీలు విధిస్తే వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యాపారులపై భారం పడితే, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వారు ఆ అదనపు భారాన్ని సామాన్య వినియోగదారులపైనే మోపే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు కూడా భావించాయి.
కొత్త తేదీ ఎప్పుడు?..
దివాళీ ముగిసిన తర్వాత, నవంబర్ రెండో వారంలో ఈ చార్జీల అమలుపై తదుపరి సమీక్ష జరిపి తుది తేదీని ప్రకటించే అవకాశముంది. ఈ ఎండీఆర్ అమలును ఏకంగా జనవరి 2027 వరకు వాయిదా వేసే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అసలు ఏమిటీ ఎండీఆర్ (MDR) చార్జీ? – లెక్కలు ఎలా ఉంటాయి?..
మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే డిజిటల్ పేమెంట్లను ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వ్యాపారుల నుంచి వసూలు చేసే ఫీజు:
  • గత నెలలో యూపీఐ నిర్వహణ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రూ. 2,000 దాటిన చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది.
  • ఉదాహరణకు, ఒక కస్టమర్ దుకాణదారుడికి రూ. 2,000 చెల్లిస్తే.. ఆ వ్యాపారి నుంచి రూ. 8 ఫీజుగా కట్ అవుతుంది. అదే రూ. 10,000 లావాదేవీ జరిగితే రూ. 40 చొప్పున వ్యాపారి చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ రుసుములపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వమే నేరుగా రుద్దకుండా.. ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములందరూ (స్టేక్‌హోల్డర్స్) పరస్పరం చర్చించుకుని నిర్ణయించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి గతంలోనే స్పష్టం చేశారు.

కార్డులతో పోలిస్తే యూపీఐపై చార్జీలు ఎందుకు సంక్లిష్టం?..

డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా యూపీఐపై రుసుములు విధించడం అంత సులభం కాదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు:
భారీ నెట్‌వర్క్..
దేశంలో కార్డులను స్వైప్ చేసే పీఓఎస్ (POS) టెర్మినల్స్ కేవలం 1.1 కోట్లు మాత్రమే ఉండగా.. క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు తీసుకునే వ్యాపారులు ఏకంగా 10 కోట్లకు పైగా ఉన్నారు. చిన్న బడ్డీ కొట్ల నుంచి గ్రామీణ ప్రాంతాల వ్యాపారుల వరకు అందరూ యూపీఐ మీదే ఆధారపడుతున్నారు.
విభిన్న కేటగిరీలు..
కార్డు చెల్లింపుల నిబంధనలు దేశవ్యాప్తంగా దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ యూపీఐలో చిన్న వ్యాపారులు, పెద్ద రిటైలర్లు, ప్రభుత్వ సేవలు వంటి వివిధ విభాగాలకు వేర్వేరు రేట్లు నిర్ణయించాల్సి రావడంతో ఈ నిబంధనల అమలు ఎంతో సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతానికి ఎన్‌పీసీఐ నిర్ణయంతో దసరా, దీపావళి వేళ డిజిటల్ షాపింగ్ చేసుకునే సామాన్య ప్రజలకు, వ్యాపారులకు ఎటువంటి అదనపు చార్జీల బెడద లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *