Keir Starmer

Keir Starmer: ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరో ప్రధాని అవుట్!

Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి ముందు కీర్ స్టార్మర్ తన భార్యతో కలిసి లండన్‌లోని అధికారిక నివాసం ’10 డౌనింగ్ స్ట్రీట్’ నుండి బయటకు వచ్చారు. అక్కడ గుమికూడిన ఆయన మద్దతుదారులు చప్పట్లతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రధాని నివాసంలో అడుగుపెట్టిన క్షణం నా జీవితంలోనే అత్యంత గర్వించదగిన సమయం. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రభుత్వం సాధించిన విజయాల ప్రస్తావన..

2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. తన హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని స్టార్మర్ పేర్కొన్నారు. సహచర దేశాల కంటే బ్రిటన్ వేగంగా వృద్ధి సాధించిందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ద్రవ్యోల్బణం (Inflation) కంటే వేగంగా ప్రజల వేతనాలు పెరిగాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎన్‌హెచ్‌ఎస్ (NHS) హెల్త్ వెయిటింగ్ లిస్టులను తగ్గించడంతో పాటు తమ పాలన వల్ల 5 లక్షల మంది పిల్లలను పేదరికం నుండి బయటకు తీసుకురాగలిగామని ఆయన డిఫెండ్ చేసుకున్నారు.

లేబర్ పార్టీలో అంతర్గత పోరు – పెరిగిన ఒత్తిడి..

బయటకు విజయాలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్టార్మర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన జీవన ప్రమాణాల మెరుగుదల వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి.

ఆండీ బర్న్‌హామ్ ఎఫెక్ట్: లేబర్ పార్టీలోనే స్టార్మర్ ప్రత్యర్థిగా భావించే ఆండీ బర్న్‌హామ్ పార్లమెంటరీ సీటు గెలుచుకోవడంతో ప్రధానిపై ఒత్తిడి పీక్స్‌కు చేరింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉన్న 100 మందికి పైగా లేబర్ పార్టీ చట్టసభ్యులు (MPs) స్టార్మర్ తక్షణమే రాజీనామా చేయాలని లేదా పదవి నుండి ఎప్పుడు తప్పుకుంటారో స్పష్టమైన గడువు ప్రకటించాలని బహిరంగంగా తిరుగుబాటు చేశారు.

బ్రిటన్‌లో పదేళ్లలోనే ఆరుగురు ప్రధానులు మారడం అక్కడి తీవ్రమైన అస్థిరతకు అద్దం పడుతోంది. ఆర్థిక ఆందోళనలు, ప్రజా సేవలపై పెరుగుతున్న ఒత్తిడి, అక్రమ వలసలు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాలు విఫలమవడంతో బ్రిటిష్ ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్టార్మర్ నిష్క్రమణతో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *