Uber & Rapido

Uber & Rapido: ఉబర్, రాపిడోలకు భారీ షాక్.. 6 నెలల పాటు సస్పెండ్ చేసిన ఎస్టీఏ..!

Uber & Rapido: ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉబర్ (Uber), రాపిడో (Rapido)లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చండీగఢ్‌లో ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ-2025’ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు గాను ఆ రెండు సంస్థల అగ్రిగేటర్ లైసెన్సులను స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (STA) ఏకంగా 6 నెలల పాటు సస్పెండ్ చేసింది.

ఇప్పటికే ఓలా (Ola), ఇన్‌డ్రైవ్ (inDrive) సంస్థల లైసెన్సులు సస్పెన్షన్‌లో ఉండగా, తాజా చర్యలతో చండీగఢ్‌లో ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ల సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయినట్లయింది. ఈ నిర్ణయంతో నిత్యం క్యాబ్ సర్వీసులపై ఆధారపడే దాదాపు లక్ష మంది నగరవాసులకు తీవ్ర అసౌకర్యం కలగనుంది.
100 రోజుల డ్రైవర్ల పోరాటం – లైసెన్సుల రద్దుకు కారణాలు..
ట్రైసిటీ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్, జై దుర్గా ఆటోరిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 రోజులుగా సాగిన ఆందోళనలు, 16 రోజుల నిరాహార దీక్షల నేపథ్యంలో ఎస్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
పాలసీ నిబంధనల ఉల్లంఘనలపై ఉబర్ ఇండియా సిస్టమ్స్, రాపిడో (రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్)లకు పలుమార్లు నోటీసులు జారీ చేసి వివరణ కోరినప్పటికీ, వారి సమర్పించిన పత్రాలు, సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎస్టీఏ కార్యదర్శి నితీష్ సింగ్లా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డ్రైవర్ల బీమా, సంక్షేమం గాలికి..
అగ్రిగేటర్ నిబంధనల ప్రకారం డ్రైవర్లకు ప్రతి 6 నెలలకోసారి ఉచిత వైద్య పరీక్షలు, వార్షిక 5% పెంపుతో కూడిన రూ.6 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించాల్సి ఉండగా కంపెనీలు బేఖాతరు చేశాయి.
నాన్-కమర్షియల్ వాహనాల వినియోగం..
అనుమతి లేని వైట్-ప్లేట్ (ప్రైవేట్/నాన్-ట్రాన్స్‌పోర్ట్) వాహనాలను అక్రమంగా ప్లాట్‌ఫారమ్‌లకు జతచేసి నడిపిస్తున్నారని ఎస్టీఏ గుర్తించింది.
నిర్ణీత ఛార్జీలు అమలు చేయకపోవడం..
జూలై 2025లో ప్రభుత్వం కిలోమీటరుకు క్యాబ్‌కు రూ.25, ఆటోకు రూ.13 ధర నిర్ణయించినప్పటికీ.. కంపెనీలు డ్రైవర్లకు పూర్తి మొత్తం ఇవ్వకుండా 20% కమిషన్, 10% సర్వీస్ ఛార్జీలు, ఇతర కోతల పేరుతో దాదాపు 50% వరకు ఆదాయాన్ని లాగేసుకుంటున్నాయని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అమన్‌దీప్ సింగ్ ఆరోపించారు. తాజా సస్పెన్షన్‌తో డ్రైవర్లు తమ నిరాహార దీక్షను విరమించారు.
జియో-బ్లాకింగ్ డిమాండ్ – ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు..
గతంలో ఓలా, ఇన్‌డ్రైవ్‌లను సస్పెండ్ చేసినప్పటికీ నగరంలో యాప్‌లు ఇంకా పని చేస్తున్నాయని, అలాగే ఉబర్, రాపిడోల విషయంలో జరగకుండా చండీగఢ్ పరిధిలో ఆయా యాప్‌లు పూర్తిగా పనిచేయకుండా ‘జియో-బ్లాకింగ్’ చేయాలని డ్రైవర్ల సంఘం నేత విక్రమ్ సింగ్ పుండిర్ యంత్రాంగాన్ని కోరారు.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు..

ప్రధాన యాప్‌లన్నీ నిలిచిపోయిన వేళ, స్థానికంగా అందుబాటులో ఉన్న ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) యాప్ యథావిధిగా పనిచేస్తోంది. దీంతో పాటు నగరంలోని బస్టాండ్లు (ISBT), రైల్వే స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, ప్రధాన విద్యా సంస్థల వద్ద సాధారణ టాక్సీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *