Tirupati

Tirumala: ముగిసిన టీటీడీ బోర్డు పదవీకాలం.. కొత్త చైర్మన్ రేసులో కళా వెంకటరావు, జ్యోతుల నెహ్రూ..?

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలకమండలి రెండేళ్ల పదవీకాలం నేటితో ముగిసింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నియమితులైన ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని 24 మంది సభ్యుల బోర్డు గడువు పూర్తయింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పాలకమండలి అధికారిక ప్రకటనపై కొంత అనిశ్చితి నెలకొంది.
నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పూర్తిస్థాయి బోర్డు నియామకం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుమల పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో తాత్కాలికంగా ఒక ‘స్పెసిఫైడ్ అథారిటీ’ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మరోవైపు నూతన టీటీడీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, ప్రస్తుత బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడికే మరో ఏడాది పొడిగింపు ఇస్తారనే ప్రచారం కూడా సాగుతుండగా, సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే కొత్త చైర్మన్ ఎంపికపై అంతర్గతంగా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పటికీ, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాలకమండలి సభ్యత్వాల కోసం మూడు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా సభ్యులను నియమించాల్సి ఉంటుంది. పలువురు బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా, మరికొందరు కూటమి పెద్దల ద్వారా బోర్డు సభ్యత్వం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సమరం ముగిసిన వెంటనే కొత్త పాలకమండలిపై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *