Medaram Jatara 2026

Medaram Jatara 2026: భక్తుల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. ఇంటికే అమ్మవారి ప్రసాదం!

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారక్క మహా జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణ ఛార్జీలను కూడా ప్రకటించింది.

జాతర ముఖ్య ఘట్టాలు

జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు అంటే 29న చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెపైకి చేరుకుంటుంది. 30వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజు జనవరి 31న సాయంత్రం దేవతలందరూ వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

ఇది కూడా చదవండి: Chandrababu: తెలుగు జాతి గర్వపడేలా పాలన.. అరాచక శక్తులకు తావులేదు

బస్సు ఛార్జీల వివరాలు

భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్‌జెండర్లు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇతర బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి:

  • హైదరాబాద్ నుంచి: ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ. 600 ఉండగా, ఏసీ బస్సుల ఛార్జీలు రూ. 1110 వరకు ఉన్నాయి.
  • వరంగల్/హన్మకొండ నుంచి: కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 500 వరకు ఛార్జీలు నిర్ణయించారు.
  • ఇతర ప్రాంతాల నుంచి: జనగామ (రూ. 400), ఖమ్మం (రూ. 480), కరీంనగర్ (రూ. 390) గా ఛార్జీలు ఖరారు చేశారు.

ఇంటి వద్దకే మేడారం ‘బంగారం’

జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. కేవలం రూ. 299 చెల్లిస్తే అమ్మవార్ల ప్రసాదాన్ని (బెల్లం) మీ ఇంటి వద్దకే చేరవేస్తుంది. ఇందుకోసం భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌లో గానీ లేదా దగ్గరలోని ఆర్టీసీ కౌంటర్లలో గానీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040-69440069 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *