tpcc-chief-mahesh-kumar-goud-chitchat-no-cabinet-expansion-konda-surekha-dismissal-aicc-decision

Mahesh Kumar Goud: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి.. దేశవ్యాప్త పోరాటానికి కాంగ్రెస్ పిలుపు!

Mahesh Kumar Goud: కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్ షా వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని, భారత ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ అనుబంధ సంస్థలా మారిపోయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించి, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.

బీజేపీకి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తోందని, స్వయంగా కమిషన్ అధికారులే ఈ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా మ్యానిపులేట్ అవుతోందని ఆరోపించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), బిహార్‌లో ఆర్జేడీ (RJD)ల ఓటమికి ఎన్నికల సంఘం మోసపూరిత వైఖరే కారణమని మహేష్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్ గెలవాల్సిన నియోజకవర్గంలోనూ కుట్రపూరితంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే..
బీఆర్‌ఎస్ వైఖరిని ఎండగడుతూ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే.. తెలంగాణలోని బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ప్రజా సమస్యలను వదిలేసి ఈడీ కార్యాలయం వద్ద నిరసనలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తెరవెనుక బీజేపీని కాపాడటానికే బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, ఆ రెండు పార్టీలు లోపాయికారీగా ఒక్కటేనని స్పష్టం చేశారు.
ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్త పోరాటం..
ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ప్రకటించారు.

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వివేక్ వెంకటస్వామి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్‌లతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *