Tollywood: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంతో నడుస్తున్న ఏఎంబీ (AMB) సినిమాస్, దక్షిణాదిలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్‌ను ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 16న ఈ సరికొత్త మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్‌లో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సినిమా థియేటర్‌గా ఏఎంబీ గుర్తింపు పొందింది.
ఈ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఇందులో మొత్తం 586 సీట్ల సామర్థ్యం కలిగిన 65 అడుగుల వెడల్పైన కర్వ్డ్ స్క్రీన్ ఉంది. 5 డాల్బీ అట్మాస్ స్క్రీన్లు, 4 డాల్బీ 7.1 స్క్రీన్లు, 2 సాధారణ ఫ్లాట్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
కర్వ్డ్ స్క్రీన్‌లో స్పష్టత కోసం డ్యూయల్ ప్రొజెక్షన్ 4K టెక్నాలజీని అమలు చేశారు. అదేవిధంగా 64 ఛానెల్ ఆబ్జెక్ట్ బేస్డ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తున్నారు.
ప్రేక్షకులు ఏ సీటులో కూర్చున్నా స్క్రీన్ ఉద్వేగాన్ని సమానంగా ఆస్వాదించేలా సీటింగ్‌ను స్టేడియం శైలిలో రూపొందించారు.
ఈ కొత్త డాల్బీ విజన్ థియేటర్లో తొలి షోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా డాల్బీ విజన్ టెక్నాలజీతో గ్రేడ్ చేయడం విశేషం.
కొద్దిరోజుల క్రితమే బెంగళూరులో తమ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ విషయాన్ని మహేశ్ బాబు సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే.
