Tirupati: తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరమని పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. గాయాలపాలైన భక్తుల ప్రాణాలను కాపాడాలని కోరుకున్నారు. ఏర్పాట్లలో వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా పలువురు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాలు కింది విధంగా ఉన్నాయి.
తొక్కిసలాట ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
తిరుపతిలో తొక్కిసలాట ఘటన ఎంతో బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తనను బాధించిందని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు నాయుడు
తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రపదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: రేవంత్‌రెడ్డి
తిరుపతి తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దైవదర్శనానికి వెళ్లిన భక్తులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
క్షతగాత్రులకు మెరుగైన సేవలు: కిషన్‌రెడ్డి
తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో తాను మాట్లాడానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలందించాలని కోరినట్టు తెలిపారు.
తీవ్ర ఆవేదన కలిగింది: పవన్ కల్యాణ్
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు మరణించడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్సలు అందజేయాలని ఆదేశించారు. వారికి టీటీడీ అండగా నిలవాలని, వారి కుటుంబీకులకు సమాచారం చేరవేయాలని సూచించారు. టికెట్ కౌంటర్ల వద్ద చర్యల్లో జనసేన కార్యకర్తలు పోలీసులకు సహాయంగా ఉండాలని కోరారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట: బీఆర్ నాయుడు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన ఈ తొక్కిసలాఠ ఘటనకు నిర్వహణ లోపమే కారణమని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. భద్రతా చర్యల్లోనూ లోపాలున్నాయని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మృతుల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఓ డీఎస్సీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగిందని తెలిపారు.