Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆనంద నిలయం విమాన గోపురంపై వాయవ్య మూలన గూడు లాంటి చిన్న మందిరం ఉంటుంది. వెండి మకరతోరణంతో ఉన్న ఆ మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానమని ప్రతీతి. క్యూలో, రద్దీ కారణంగా ఆనంద నిలయంలోని స్వామి వారి దర్శనం కాకపోతే ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా యాత్రా ఫలం దక్కుతుందని నమ్మకం.
Tirumala: శ్రీవారి మూలవిరాట్టును దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగివచ్చేదారిలో, భక్తులు హుండీ వద్దకు వెళ్ళే ముందు, విమాన వేంకటేశ్వరస్వామిని ఉత్తర భాగంలో మెట్లు, గట్టు ఎక్కి మరీ దర్శనం చేసుకుంటూంటారు. పూర్వం ఏ కారణంతోనైనా తిరుమల వచ్చినా వేంకటేశ్వరస్వామి దర్శనం దొరకక వెనుతిరగాల్సివస్తే, విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వేంకటేశ్వరస్వామి దర్శనం అయినట్టే భావించేవారు.
Tirumala: శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిత్యం జరిగే వేదపారాయణ విషయంలో విమాన వేంకటేశ్వరస్వామికి ప్రాధాన్యత ఉంది. దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుంచి ప్రస్తుత కాలం వరకూ నిత్యం విమాన వేంకటేశ్వరుని ఎదుటే చేయడం సంప్రదాయం. మధ్వపండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ, ప్రత్యేకించి తితిదే ఏర్పాటుచేసినప్పుడు కానీ విమాన వేంకటేశ్వరుని ముందు కూర్చుని వేంకటాచల మాహాత్మ్యం, శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణ చేయడం, సర్వమూల గ్రంథ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది.
Tirumala: నిత్యం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) కు నివేదించిన నైవేద్యాన్నే తిరిగి విమాన వేంకటేశ్వరస్వామికి నివేదిస్తారు. విమాన వేంకటేశ్వరుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన జరిగినా కూడా, తిరుమలలో ఏకమూర్తి ఆరాధనే అమలులో ఉండడం వల్ల ఆలయంలోని మూలవిరాట్టుకు, క్షేత్రంలో నివసించేందుకు వేంకటేశ్వరుడికి అనుమతినిచ్చాడని పురాణగాథలు. భూవరాహ స్వామికి తప్ప వేరే ఏ విగ్రహానికీ ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టే సంప్రదాయం లేదు. శ్రీవారికి నివేదించిన నైవేద్యాన్నే తిరిగి ఆయా దేవతామూర్తులకు నివేదించడం తిరుమలలోని పద్ధతి.