Rashmika Mandanna: నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ కెరీర్ రాబోయే మాసాల్లో ఊహకందని స్థాయిలో ఉండబోతోంది. వచ్చే పది నెలల్లో ఆమె నటించిన ఆరేడు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. ‘పుష్ప’ మూవీతో నేషనల్ క్రష్ గా మారిన రశ్మిక జాతీయ స్థాయిలో తన సత్తా చాటబోతోంది.
ఎనిమిదేళ్ళ క్రితం ‘కిర్రాక్ పార్టీ’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రశ్మిక మందణ్ణ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత రెండేళ్ళకు ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఏ ముహూర్తాన ఆమె తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిందో… అక్కడ నుండి ఇక వెనుదిరిగి చూసిందే లేదు. ఆ యేడాది ఏకంగా మూడు తెలుగు సినిమాలో చేసింది రశ్మిక. ‘ఛలో’ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ ఘన విజయం సాధించగా, ‘దేవదాసు’ మోడరేట్ హిట్ అయ్యింది.
Rashmika Mandanna: ‘గీతగోవిందం’తో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఆ తర్వాత సంవత్సరం ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి కలిసి నటించారు. అప్పటి నుండీ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే మాట వినిపిస్తోంది. కానీ వీరు మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలోనే రశ్మికకు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే అభిప్రాయాలు కలవకపోవడంతో అది పెళ్లి వరకూ వెళ్ళలేదు. అందుకే రశ్మిక ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే ఎదురైన ఎదురు దెబ్బలతో రశ్మిక పూర్తి స్థాయిలో కెరీర్ మీద దృష్టి పెట్టింది. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకీ అడుగుపెట్టింది. తొలి తమిళ చిత్రం ‘సుల్తాన్’ పెద్దంత ఆడకపోయినా… ‘వారిసు’తో తమిళనాట విజయాన్ని అందుకుంది. అలానే తొలి హిందీ సినిమా ‘గుడ్ బై’ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా… లాస్ట్ ఇయర్ వచ్చిన ‘యానిమల్’తో విజయ పతాకాన్ని ఎగరేసింది.
Rashmika Mandanna: విశేషం ఏమంటే… లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న ‘యానిమల్ మూవీ విడుదలైంది. మళ్ళీ ఇంతవరకూ రశ్మిక నటించిన ఏ సినిమా… ఏ భాషలోనూ విడుదల కాలేదు. అయితే… గత కొంతకాలంగా రశ్మిక సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. వాటి ఫలితాలను రాబోయే పది మాసాలలో అందుకోబోతోంది. ఈ యేడాది డిసెంబర్ 5న రశ్మిక నటించిన ‘పుష్ప -2’ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాతో పాటే ఆమె నటించిన హిందీ సినిమా ‘ఛావా’ 6న విడుదల కావాల్సి ఉంది. దాని విడుదల వాయిదా పడుతోందని సమాచారం. చిత్రబృందం మాత్రం ఇంకా కొత్త డేట్ ను ప్రకటించలేదు.
ఈ యేడాది ‘పుష్ప-2’లో సరిపెట్టుకున్నా… వచ్చే సంవత్సరం మాత్రం రశ్మిక మందణ్న చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. ‘యానిమల్’లో రణబీర్ కపూర్ తో జోడీ కట్టిన రశ్మిక ఇప్పుడు హిందీలో విక్కీ కౌశల్ ‘ఛావా’తో పాటుగా సల్మాన్ ఖాన్ సరసన ‘సికిందర్’లో నటిస్తోంది. ఈ మూవీ ఈద్ కానుకగా విడుదల కానుంది. విశేషం ఏమంటే ఫక్తు కమర్షియల్ సినిమాలే కాదు… లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో సైతం రశ్మిక నటిస్తోంది. అలా రూపుదిద్దుకుంటున్న చిత్రాలలో ‘రెయిన్ బో’ ఒకటి. ఈ సినిమా నిర్మాణంలో జాప్యం జరిగింది. సో… రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఇది రావొచ్చు. అలానే నటుడు రాహుల్ రవీందర్ డైరెక్ట్ చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలోనే రశ్మికనే ప్రధాన పాత్రధారిణి.
Rashmika Mandanna: తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న ‘కుబేర’ సినిమాలో రశ్మిక నాయికగా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రశ్మిక పాత్ర సైతం చాలా ప్రాధాన్యం ఉన్నదిగా తెలుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తయిన ‘కుబేర’ సమ్మర్ లో జనం ముందుకు రాబోతోంది. అలానే ‘స్త్రీ -2’ మేకర్స్ సైతం రశ్మిక మందణ్ణతో హిందీలో హారర్ డ్రామా ‘తమ’ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సైతం వచ్చే యేడాది విడుదల అవుతుందని తెలుస్తోంది. ఆ రకంగా మూడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు నాలుగు కమర్షియల్ సినిమాలను లైన్ అప్ లో పెట్టింది రశ్మిక. ఆమె కెరీర్ లోనే ఎప్పుడూ లేని విధంగా వచ్చే యేడాది ఆరు చిత్రాలు విడుదల కానుండటం విశేషమే.