రసాయనాలు, పామాయిల్‌తో నకిలీ నెయ్యి తయారీ – బయటపడ్డ నిజాలు..
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో కూపీ లాగిన ఈడీ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి..
పవిత్రమైన లడ్డూ ప్రసాదం కోసం అసలైన ఆవు నెయ్యి సరఫరా చేస్తున్నామని నమ్మబలికి.. రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్‌లను కలిపారు. వీటికి తోడు ఎంజీ-90 (MG-90), మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ సాఫ్ట్ 400, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయన పదార్థాలను జోడించి నకిలీ నెయ్యిని తయారు చేశారు.
ఈ రసాయనాల నెయ్యిని ‘అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ’గా లేబుల్ వేసి టీటీడీకి విక్రయించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా అయిన సుమారు ₹230 కోట్ల విలువైన అనుమానాస్పద నెయ్యిలో.. ఏకంగా ₹96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్‌చంద్ మాంగ్లాకు చెందిన సుకృతి ఫుడ్స్ యూనిట్లోనే తయారు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.
డొల్ల కంపెనీలు – నకిలీ బిల్లులతో మనీలాండరింగ్..
కల్తీ నెయ్యి దందా బయటపడకుండా ఉండేందుకు కొనుగోళ్లు, అమ్మకాలు, రవాణాకు సంబంధించి నకిలీ బిల్లులు, బోగస్ రికార్డులను సృష్టించారు. ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు, వాటికే విక్రయించినట్లు కాగితాలపై చూపించారు.
శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మాల్‌గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి సంస్థలతో కైలాష్‌చంద్ మాంగ్లా సమన్వయం చేసుకుంటూ నెట్‌వర్క్ నడిపినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. టీటీడీ టెండర్ల దక్కించుకోవడంలో మధ్యవర్తిత్వం వహించడంతో పాటు లంచాల చెల్లింపుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.
మనీ ట్రయల్‌పై ఈడీ నజర్ – రాజకీయ లింకులపై ఉత్కంఠ..
సిట్ (SIT) చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ, ఈడీ ‘మనీ ట్రయల్’ (డబ్బు ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది) ఆధారంగా దర్యాప్తు చేస్తుండటంతో గతంలో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులకు మళ్లీ జైలు భయం పట్టుకుంది. టీటీడీ టెండర్ల కేటాయింపులో అప్పటి అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు, మాజీ ఛైర్మన్ అనుచరుల ప్రమేయంపైనా ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చేందుకు బ్యాంక్ లావాదేవీలను జల్లెడ పడుతున్నారు.
కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ మహా కుంభకోణంలో అసలు సూత్రధారులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.