Threatning calls: బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.
గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాటిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, ఎయిర్ ఇండియాకు చెందిన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు, సీఐఎస్‌ఎఫ్ వర్గాలు.. మూడు విమానాలను తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, గత 16 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 100 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. గడిచిన 16 రోజుల్లో మొత్తం 510 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఉత్తుత్తివేనని తేలింది.
ఈ బెదిరింపులపై సంబంధిత విభాగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిరిండియా, ఇండిగో, విస్తారా సంస్థల విమానాలకు ఎక్స్‌లో బెదిరింపులు రాగా.. గుర్తుతెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.