TGSRTC: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేసింది. జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ డిపోల నుంచి వందలాది బస్సులను మేడారానికి నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ప్రత్యేక బస్సుల కేటాయింపులో కొత్తగూడెం డిపో ముందంజలో ఉంది. ఇక్కడి నుండి అత్యధికంగా 110 బస్సులను నడపనున్నారు. అలాగే ఇల్లెందు నుంచి 41, భద్రాచలం నుండి 21, పాల్వంచ నుండి 15, ఖమ్మం నగరం నుంచి 10 బస్సులను భక్తుల కోసం సిద్ధం చేశారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు కలగకుండా ఈ రూట్లలో బస్సు సర్వీసులను పక్కాగా ప్లాన్ చేశారు.
కేవలం ప్రధాన పట్టణాలే కాకుండా, ఏజెన్సీ ప్రాంతాల నుండి కూడా బస్సులను ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం నుంచి 17, మణుగూరు నుంచి 16, వెంకటాపురం నుంచి 6, మంగపేట నుంచి 5 బస్సులను నడపనున్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులను పెంచేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా మేడారం వెళ్లాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
