Telangana: ఎట్టకేలకు లగచర్ల గిరిజన రైతుల పోరాటం ఫలించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. ఫార్మా కంపెనీల ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకించిన రైతు కుటుంబాలకు ఉపశమనం లభించింది. పేదల దుఃఖానికి కారణమైన ఫార్మా ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. లగచర్ల రైతుల పోరాటానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నానికి ఫలితం దక్కింది. వివిధ పార్టీలు, పలు ప్రజా సంఘాలు లగచర్ల పోరాటానికి మద్దతుగా నిలిచాయి. ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించాయి.
Telangana: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పరిసర గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని రైతులపై అధికారులు గత ఆరు నెలలుగా ఒత్తిళ్లు తెచ్చారు. తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని రైతు కుటుంబాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై బాధిత రైతు కుటుంబాలు తిరుగుబాటు చేశాయి. అధికారులపై, వాహనాలపై దాడులు చేశారు.
Telangana: ఈ దాడులను ఆసరా చేసుకొని పోలీసులు రాత్రికి రాత్రి లగచర్ల ఇతర గ్రామాలపై బడి రైతులను అరెస్టులు చేసి జైలుకు పంపారు. స్టేషన్‌లో విచారణ సమయంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కోర్టులో బాధిత రైతులు చెప్పారు. దీంతో రగిలిన గిరిజనులు ఢిల్లీ వరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ పరంగా న్యాయ సహాయం చేయడంతోపాటు రైతులను సమీకరించి పోరాటం నిర్వహించింది.
Telangana: ఈ మేరకు ప్రభుత్వం దిగొచ్చి కీలక నిర్ణయం తీసుకున్నది. లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భూ సేకరణ చట్టం- 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకుంటున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషపడుతున్నారు. తమ భూములు తమకే దక్కాయని ఆనంద పడుతన్నారు.