Cheyutha Pensions

Cheyutha Pensions: తెలంగాణలో 4.5 లక్షల మందికి కొత్త ‘చేయూత’ పింఛన్ల పంపిణీ షురూ..

Cheyutha Pensions: ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన ‘చేయూత’ (Cheyutha Pensions) పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం (నవంబర్ 12) రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఒకేసారి 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేయడంతో గ్రామాలు, పట్టణాల్లో పండగ వాతావరణం నెలకొంది.
నవంబర్ 12 నుంచి 18 వరకు పంపిణీ – 19న అకౌంట్లలోకి నగదు!
ప్రభుత్వం ఈ పంపిణీ ప్రక్రియకు పక్కా షెడ్యూల్‌ను అమలు చేస్తోంది..
  • పత్రాల పంపిణీ: ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గ, మండల మరియు మున్సిపాలిటీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు స్వయంగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను (Sanction Letters) అందజేస్తున్నారు.
  • నవంబర్ 19న నగదు జమ: పంపిణీ ప్రక్రియ ముగిసిన వెంటనే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డీబీటీ (DBT) ద్వారా పింఛన్ నగదును జమ చేయనున్నారు.

మహిళలకు పెద్దపీట – సమస్యల పరిష్కారానికి స్పెషల్ కౌంటర్లు..

తాజాగా మంజూరు చేసిన ఈ కొత్త పింఛన్లలో వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. తమ చేతికి మంజూరు పత్రం అందగానే ఎంతోమంది వృద్ధులు, మహిళలు భావోద్వేగానికి గురవుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరియు సెర్ప్ (SERP) అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా ఆధార్ అప్‌డేట్, బ్యాంకు ఖాతా లింకింగ్ లేదా ఇతర సాంకేతిక లోపాలతో పింఛన్ ఆగిపోకుండా ఉండేందుకు పంపిణీ కేంద్రాల వద్దే ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారు.

5.73 లక్షలు దాటిన కొత్త లబ్ధిదారుల సంఖ్య..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో వివిధ విడతల్లో ఇప్పటివరకు 1,23,625 మందికి కొత్త పింఛన్లు అందించగా.. తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్తగా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఏకంగా 5,73,625కు చేరుకుంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లక్షలాది పేద కుటుంబాలకు నెలనెలా భరోసా లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *