Shatrucharla Passed Away

Shatrucharla Passed Away: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. రేపు చిన్నమేరంగిలో అంత్యక్రియలు!

Shatrucharla Passed Away: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా పేరుగాంచిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

శత్రుచర్ల భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆయన స్వగ్రామం చిన్నమేరంగికి తరలించారు. శుక్రవారం చిన్నమేరంగిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శత్రుచర్ల విజయరామరాజు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజాసేవ చేశారు. 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన, ఆ తర్వాత 1983, 1985లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1991 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి కాంగ్రెస్ ఎంపీగా, 1998లో టీడీపీ ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన సొంతం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో ఆయన కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలకు అతీతంగా అందరితోనూ ఆప్యాయంగా మెలిగే శత్రుచర్ల మృతి ఉత్తరాంధ్రకు తీరని లోటని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *