Kia India: కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అనంతపురం జిల్లా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India).. ఇప్పుడు రాయలసీమ యువతకు మరో భారీ శుభవార్త అందించింది! విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit-2026)లో కియా ఇండియా తన విస్తరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించింది. అనంతపురం ప్లాంట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ఏకంగా 2 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 17,500 కోట్లు) అదనపు పెట్టుబడి పెట్టబోతున్నట్లు వెల్లడించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఈ మెగా డీల్ కుదరడం విశేషం.
రెట్టింపు కానున్న ఉత్పత్తి – 3,000 మందికి డైరెక్ట్ జాబ్స్..
సదస్సులో కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గ్వాంగు లీ (Gwanggu Lee) ఈ భారీ విస్తరణ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అనంతపురం ప్లాంట్‌లో ఏడాదికి 3 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యం ఉండగా, ఈ కొత్త పెట్టుబడితో దాన్ని ఏకంగా 6.2 లక్షల యూనిట్లకు పెంచనున్నారు.
ఈ విస్తరణ ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 3,000 అదనపు ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కనుంది. ఈ నూతన పెట్టుబడితో అత్యాధునిక కార్ల మోడళ్లను, కొత్త పవర్‌ట్రెయిన్ (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) టెక్నాలజీని భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సీఈఓ తెలిపారు.
అనుబంధ సంస్థల నుంచి మరో ₹1,614 కోట్ల పెట్టుబడులు..
కియా విస్తరణతో పాటు స్థానిక సప్లై చైన్‌ను బలోపేతం చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన మరో మూడు ప్రధాన విడిభాగాల తయారీ సంస్థలు కూడా అనంతపురంలో అడుగుపెడుతున్నాయి. హ్వాషిన్ (Hwashin), సెయోన్ (Seoyon), ఇవామెట్ (Iwamet) సంస్థలు కలిసి అదనంగా రూ. 1,614 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా రాయలసీమలో మరో 1,400 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
100 దేశాలకు ‘మేడ్ ఇన్ ఏపీ’ కార్లు – సేల్స్‌లోనూ రికార్డులు!
2017లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన కియా ప్రయాణం, 2019లో ఉత్పత్తి ప్రారంభించి నేడు కియాకు గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మారింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్వాంగు లీ కొనియాడారు. అనంతపురం ప్లాంట్‌లో తయారైన 1.1 లక్షలకు పైగా కార్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
దేశీయ మార్కెట్‌లోనూ కియా దూసుకుపోతోంది. ఈ ఏడాది అక్టోబర్ ఒక్క నెలలోనే 33,462 కార్ల విక్రయాలతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించగా, జనవరి–అక్టోబర్ మధ్యకాలంలో ఏకంగా 2.86 లక్షల యూనిట్లను విక్రయించి సత్తా చాటింది.
