SBI Bank Holidays

SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!

SBI: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన రాయదుర్గం భూముల వేలం వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. గత కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి మధ్య నలిగిన ఈ భూ వివాదంలో ఎస్‌బీఐ యాజమాన్యం ఒక అడుగు వెనక్కి తగ్గింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిపిన పలు దఫాల చర్చల అనంతరం సమస్య పరిష్కారానికి బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి గతంలో తాము హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎస్‌బీఐ సుముఖత వ్యక్తం చేసింది. వివాదాస్పదంగా మారిన రాయదుర్గం స్థలానికి బదులుగా, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆఫర్ చేసిన మరో 2.5 ఎకరాల వేరే స్థలాన్ని తీసుకోవడానికి బ్యాంక్ ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) అధికారులతో ఎస్‌బీఐ ప్రతినిధులు త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై తుది చర్చలు జరపనున్నారు.

ఈ భూ వివాదం ముదిరిన సమయంలో ఎస్‌బీఐపై కఠిన వైఖరి అవలంబించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంక్ సానుకూలంగా స్పందించడంతో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీలన్నింటినీ నిలిపివేస్తూ, కొత్తగా ఎలాంటి డిపాజిట్లు చేయవద్దంటూ జారీ చేసిన అంతర్గత ఆంక్షలను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ గ్రాంట్ల నిర్వహణ మునుపటిలాగే ఎస్‌బీఐ ద్వారానే కొనసాగనుంది. దీనితో పాటు రాష్ట్రంలో ఎస్‌బీఐకి ఉన్న అత్యంత కీలకమైన ‘లీడ్ బ్యాంక్’ (Lead Bank) హోదాను కూడా యథాతథంగా కొనసాగించనున్నారు. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ముగిసిన వెంటనే, ఈ భూమి బదిలీ ఒప్పందం మరియు ప్రభుత్వ లావాదేవీల పునరుద్ధరణకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *