Cinema Ticket Prices: తెలంగాణలో సినీ ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు సినిమా వినోదం అందుబాటులో ఉండేలా చూస్తూనే, ఆధునిక సాంకేతికతతో నడిచే థియేటర్లకు ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది.
సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల పరిమితులు, రోజువారీ షోల సమయాలు, చిన్న సినిమాల ప్రదర్శనతో పాటు భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ పెంపుపై స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది.
ప్రభుత్వ తాజా జీవోలోని ప్రధాన ముఖ్యాంశాలు:
-
కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ: ఆధునిక సౌకర్యాలు ఉన్న సింగిల్ స్క్రీన్లకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 2K లేదా 4K ప్రొజెక్షన్, 75 అడుగులు లేదా అంతకంటే పెద్ద స్క్రీన్లు కలిగిన సింగిల్ స్క్రీన్లను ఇకపై ‘స్పెషల్ థియేటర్లు’గా వర్గీకరిస్తారు.
-
పేద, మధ్యతరగతి కోసం 25% ‘నాన్-ప్రీమియం’ సీట్లు: సామాన్యులపై అధిక ధరల భారం పడకుండా ఉండేందుకు మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను ‘నాన్-ప్రీమియం’ కేటగిరీగా ఉంచడం తప్పనిసరి చేశారు.
-
రోజుకు 5 షోల ప్రదర్శన: థియేటర్లలో ఉదయం 8:00 గంటల నుంచి అర్ధరాత్రి 1:00 గంట వరకు రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
-
చిన్న సినిమాలకు ప్రైమ్ టైమ్ రక్షణ: పెద్ద చిత్రాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు.. ఆ చిన్న చిత్రాలకు కచ్చితంగా ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల మధ్య ప్రైమ్ టైమ్‌లో ప్రతిరోజూ కనీసం ఒక షో కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.
రూ. 100 కోట్ల భారీ చిత్రాలు & కార్మికుల సంక్షేమ నిధి:
భారీ వ్యయంతో తెరకెక్కే సినిమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది..
-
సూపర్ హై బడ్జెట్ హోదా: రూ. 100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో తీసే సినిమాలను ‘సూపర్ హై బడ్జెట్ సినిమాలు’గా గుర్తిస్తారు.
-
మొదటి 10 రోజులు ధరల పెంపు: ఈ చిత్రాలు విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
-
కార్మికుల సంక్షేమానికి విరాళం: టికెట్ ధరలు పెంచుకోవాలనుకునే నిర్మాతలు.. సినీ కార్మికుల సంక్షేమ నిధికి రూ. 1 కోటి వరకు విరాళం ఇవ్వాలని లేదా అదనపు ఆదాయం నుంచి నిర్ణీత వాటాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC), సినీ కార్మికుల సంక్షేమానికి జమ చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.
