Sushmita Patel

Sushmita Patel: పరకాల నాది.. కొండా మురళి కింగ్ మేకర్..

Sushmita Patel: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ పంచాయితీ తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రేవంత్ రెడ్డి నిర్ణయాలను నేరుగా ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పరకాల నుంచి తానే బరిలోకి దిగుతానని, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గెలుస్తానని సుస్మిత స్పష్టం చేశారు.
కొండా మురళిని తొక్కుతున్నారు – పీసీసీ చీఫ్ హామీ ఏమైంది?
తన తండ్రి, సీనియర్ నేత కొండా మురళి రాజకీయ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ సుస్మిత మాట్లాడారు:
  • కింగ్ మేకర్ కొండా మురళి: “మా నాన్న మామూలు నాయకుడు కాదు.. ఆయన ఒక కింగ్ మేకర్. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని మొదట కోరింది కొండా దంపతులే. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ మా ఇంటికి వచ్చి, పార్టీ గెలిచినా గెలవకపోయినా నాన్నను ఎమ్మెల్సీ చేస్తామని స్వయంగా మాట ఇచ్చారు. మరి ఆ హామీ ఏమైంది? కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానని అనలేదని రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేయగలరా?” అని నిలదీశారు.
  • బీసీల పట్ల వివక్ష: బీసీ నాయకులంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చులకన భావమని, ఉద్యమ కాలం నుంచి నిలబడిన అసలైన బీసీ నేతలను ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నించారు.

అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్

పార్టీ అంతర్గత పరిణామాలపై సుస్మిత ఘాటు విమర్శలు చేశారు:
  • టీడీపీ నేతలపైనే ప్రేమ: “కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం రేవంత్ రెడ్డికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. పార్టీ కోసం రక్తం ధారపోసిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తల కంటే, టీడీపీ నుంచి వచ్చిన ‘పచ్చ కాంగ్రెస్’ నేతలపైనే రేవంత్‌కు ఎక్కువ ప్రేమ కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎవరూ సంతృప్తిగా లేరు” అని వ్యాఖ్యానించారు.
  • రేవూరి ప్రకాష్‌రెడ్డికి సవాల్: “ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పరకాల టికెట్ రేవూరి ప్రకాష్‌రెడ్డిదేనని సీఎం ఎలా ప్రకటిస్తారు? ఎన్నికల ముందు పరకాలలో ఆయన ఎవరికైనా తెలుసా? ఆయన కోసం కొండా మురళి ప్రచారం చేస్తేనే గెలిచారు. దమ్ముంటే రేవూరి చేత ఇప్పుడే రాజీనామా చేయించి మళ్లీ గెలిపించాలి” అని సవాల్ విసిరారు.
పరకాల గడ్డపై తమ కుటుంబానికి ఉన్న పట్టును ఎవరూ కాదనలేరని, తన జోలికి వస్తే ప్రెస్ క్లబ్‌లో కూర్చుని అందరి బాగోతాలు బయటపెడతానని సుస్మిత హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *