Telangana: డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని, వేలాది మందిని ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Telangana: ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి ఏడాదిలో సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికలను శాఖలవారీగా ప్రజలకు వివరించనున్నారు. రైతుల రుణమాఫీ, వడ్ల బోనస్ సహా ఇతర పథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల కల్పన గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. 9 రోజులపాటు శాఖలవారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపడుతారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు.
Telangana: ఈ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేదిక నుంచే గ్రూప్ 4లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 8,080 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ప్రభుత్వం వచ్చాక చేపట్టిన ఉద్యోగ నియామకాలపై ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇంకా చేపట్టే ఉద్యోగ నియామకాలపై ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.
Telangana: డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా భారీ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రోజుల్లో హైదరాబాద్ సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లతో సందడి నెలకొననున్నది. పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు ఉద్యమకారులు, మేథావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభచాటిన వారిని ఆహ్వానించనున్నారు.
Telangana: నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి, లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది.