CM Revanth Reddy: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నడీ స్కూల్లో ‘లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ: కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్’ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కోర్సులో ఆయన విద్యార్థిగా చేరారు. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండగానే ఒక ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఇలాంటి కోర్సు అభ్యసిస్తున్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఒకవైపు విద్యార్థిగా క్లాసులకు హాజరవుతూనే, మరోవైపు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని భారతీయ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారిలో స్ఫూర్తిని నింపారు.
హార్వర్డ్ ప్రాంగణంలో ‘రైజింగ్ తెలంగాణ’ నినాదం
ముఖ్యమంత్రి తన బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించి విద్యార్థులతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లను, విజయ రహస్యాలను పంచుకున్నారు. పట్టుదల, నిరంతర కృషి ఉంటేనే సామాన్య స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైజింగ్ తెలంగాణ’ విజన్‌ను వారికి వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదని, దీనిని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు.
Also Read: KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: కేసీఆర్‌కు నోటీసుల దిశగా సిట్
విద్యార్థులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు
హార్వర్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై చదువుతున్న విద్యార్థులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇక్కడి విద్యా నైపుణ్యాలను, ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రగతికి ఎలా ఉపయోగించవచ్చో వారితో చర్చించారు. హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, విదేశాల్లో ఉన్న తెలుగు మేధావులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సహకరించాలని ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, స్కిల్ డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాటలతో ఉత్తేజితులైన విద్యార్థులు ఆయనను సాదరంగా తమ క్యాంపస్‌కు ఆహ్వానించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
