Telangana

Telangana: బియ్యం కోసం క్యూ లైన్ల తిప్పలు తప్పినట్టే.. ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ!

Telangana: తెలంగాణలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎండలు ముదురుతున్న వేళ, పేద ప్రజలు ప్రతి నెలా రేషన్ షాపుల ముందు గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల వేసవి తాపం నుంచి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వనుండటంతో, కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికీ 18 కిలోల బియ్యం అందుతాయి. ఉదాహరణకు, ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే, ఆ కుటుంబానికి ఏకంగా 72 కిలోల సన్నబియ్యం ఒకేసారి వస్తాయి. దీనివల్ల వేసవి సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి లేదా ఎండ తీవ్రత వల్ల బయటకు రాలేని వారికి బియ్యం నిల్వల విషయంలో ఎటువంటి ధీమా ఉంటుంది.

అయితే, ఇంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం అధికారులకు సవాలుగా మారింది. గతంలో ఇలా చేసినప్పుడు రేషన్ షాపుల్లో స్టాక్ ఉంచడానికి స్థలం లేక డీలర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే, బయోమెట్రిక్ యంత్రాల్లో మూడు నెలల కోటా కోసం మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీనివల్ల సర్వర్ సమస్యలు వచ్చి పంపిణీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు కలగకుండా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది.

త్వరలోనే ఈ పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను, తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ నెలలోనే మూడు నెలల బియ్యం చేతికి వస్తుండటంతో పేద కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, లబ్ధిదారులకు పదే పదే షాపుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *