Revanth Reddy

Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్.. ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం!

Revanth Reddy: హైదరాబాద్ మహానగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో, నగర రూపురేఖలను సమూలంగా మార్చి ‘క్లీన్ సిటీ, ట్రాఫిక్ ఫ్రీ సిటీ’గా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ పరిపాలన, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో చెత్త రహిత వాతావరణం, నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగం, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారాలపై అధికారులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఎక్కడా చెత్త కనిపించొద్దు.. పారిశుధ్యంపై కఠిన హెచ్చరికలు

నగరంలో పారిశుధ్య నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇంటింటికీ చెత్త సేకరణ: నగరవ్యాప్తంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిర్మాణ వ్యర్థాల తరలింపు: రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వేసే నిర్మాణ వ్యర్థాలను (C&D Waste) ఎప్పటికప్పుడు తొలగించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని, ఏర్పాట్లను చేయాలన్నారు.

ఇండస్ట్రియల్ ఏరియాల్లో సమన్వయం: మున్సిపల్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ కోసం ఐలా (IALA) అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

తాగే నీటి ఆదా చేద్దాం.. ని ఆదా చేద్దాం.. ‘గ్రీన్ ట్యాంకర్ల’పై విస్తృత అవగాహన!

నగరంలో విలువైన తాగునీటిని కాపాడేందుకు జలమండలి తీసుకొచ్చిన ‘గ్రీన్ ట్యాంకర్ల’ విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి అవసరాలకు ప్రస్తుతం విలువైన తాగునీటిని వాడుతున్నారని, దీనికి బదులుగా మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) ద్వారా వచ్చే శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని తెలిపారు.
ఇందుకోసం జలమండలి తొలి విడతలో 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరాను ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ గ్రీన్ వాటర్ సేవలను జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు సమీపంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరింతగా విస్తరించాలని, దీనివల్ల వేలాది గ్యాలన్ల తాగునీరు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్.. ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం!
నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నగరంలో వాహనాల రద్దీని క్రమబద్ధీకరించి ‘ట్రాఫిక్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కీలక ప్రాంతాల్లో అవసరమైన మేరకు నూతన అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను (DPR) సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *