CBFC New Guidelines: గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో పాన్-ఇండియా, పర్ఫెక్షన్ అనే పేర్లతో చివరి నిమిషం వరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగదీయడం సాధారణమైపోయింది. రిలీజ్ డేట్ తలకు మించిన భారమైనా చివరి నిమిషంలో హడావుడిగా సెన్సార్ బోర్డు ముందుకు అసంపూర్తి ప్రింట్లతో రావడం, సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని ఒత్తిడి తేవడం తరచూ వివాదాలకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినీ దర్శకులు, నిర్మాతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత, నాణ్యతను పెంచేందుకు సరికొత్త కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
సీబీఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాజేంద్ర సింగ్ సంతకంతో విడుదలైన ఈ అడ్వైజరీ ప్రకారం.. అసంపూర్తి ప్రింట్లను ఇకపై పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, పల్లవి జోషి, రికీ కేజ్, సుప్రియ యార్లగడ్డ వంటి ప్రముఖులతో కూడిన 18 మంది కొత్త సభ్యులతో బోర్డు పునర్వ్యవస్థీకరణ జరిగిన అనంతరం ఈ నిర్ణయాలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సెన్సార్ బోర్డ్ జారీ చేసిన కీలక నిబంధనలు..
-
పూర్తి స్థాయి ఫైనల్ కాపీ తప్పనిసరి: సెన్సార్ స్క్రీనింగ్ కోసం సమర్పించే సినిమా అన్ని విధాలుగా పూర్తయి ఉండాలి. ఫైనల్ గ్రాఫిక్స్ (VFX), టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, చట్టబద్ధమైన డిస్‌క్లెయిమర్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), సౌండ్ మిక్సింగ్ అన్నీ పూర్తయిన తర్వాతే ప్రింట్ ఇవ్వాలి. టెంపరరీ మ్యూజిక్ లేదా డమ్మీ గ్రాఫిక్స్‌తో వచ్చే దరఖాస్తులను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి తిరస్కరిస్తారు.
-
దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు: ఫైనల్ థియేట్రికల్ వెర్షన్‌లో వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా క్లోజ్డ్ క్యాప్షన్స్ (Closed Captions), సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ (Audio Description) వంటి యాక్సెసిబిలిటీ ఫీచర్లను తప్పనిసరిగా చేర్చాలి.
-
రిలీజ్ డేట్‌ను బట్టి వేగవంతం చేయరు: సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాం, ట్రైలర్ లాంచ్ ఉంది కాబట్టి వెంటనే సర్టిఫికేషన్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తే బోర్డు అంగీకరించదు. సినీ నిర్మాతలు స్వయంగా పెట్టుకున్న రిలీజ్ తేదీలతో సెన్సార్ బోర్డుకు సంబంధం లేదని, సినిమాటోగ్రఫీ చట్టం 1952, సర్టిఫికేషన్ రూల్స్ 2024 ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే సమీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
-
ప్రమోషన్లలో వాడే టైటిలే ఫైనల్ కాదు: దరఖాస్తులో పేర్కొన్న టైటిల్ గానీ, ప్రచార చిత్రాలు, టీజర్లలో వాడుతున్న టైటిల్స్ గానీ సెన్సార్ పరంగా శాశ్వతం కావు. ఎగ్జామినింగ్ లేదా రివైజింగ్ కమిటీ పరిశీలనలో అభ్యంతరాలు వ్యక్తమైతే సినిమాటోగ్రఫీ చట్టం సెక్షన్ 5B(1) ప్రకారం టైటిల్స్‌లో మార్పులు లేదా చేర్పులను సూచించే పూర్తి హక్కు బోర్డుకు ఉంటుంది.
-
ముందస్తు దరఖాస్తు తప్పనిసరి: సినిమా పరిశీలన, కమిటీ రివ్యూ, అవసరమైన కట్స్ లేదా మార్పులను అమలు చేయడానికి తగినంత సమయం కావాలి కాబట్టి, రిలీజ్ తేదీకి చాలా రోజుల ముందే పూర్తి పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు, పూర్తి వర్షన్ అందిన తేదీనే అధికారిక దరఖాస్తు తేదీగా పరిగణిస్తారు.
గత వివాదాల నేపథ్యంలోనే ఈ చర్యలు!
ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కావడం, చివరకు కోర్టుకెళ్లినా ఉపశమనం లభించకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అలాగే దిల్జిత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద సినిమా ‘సట్లజ్’ (గతంలో ‘పంజాబ్ 95’) సర్టిఫికేషన్ లభించక ఓటీటీలోకి అకస్మాత్తుగా వచ్చి గంటల్లోనే తొలగించబడింది.
ఇలాంటి ఉద్రిక్తతలు, చట్టపరమైన చిక్కులను నివారించడానికే సెన్సార్ బోర్డ్ తాజా గైడ్‌లైన్స్‌ను కఠినతరం చేసింది. ఇకపై పక్కా ప్రణాళికతో, పూర్తి ప్రింట్లతో వస్తేనే సెన్సార్ గేట్లు దాటడం సాధ్యమవుతుందని మేకర్లకు తేల్చి చెప్పింది.
