Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం చేపట్టిన హైదరాబాద్ పర్యటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ముఖ్య నేతలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
విమానాశ్రయం నుంచి అమిత్ షా భారీ కాన్వాయ్‌లో నేరుగా పాతబస్తీలోని చారిత్రక చార్మినార్ చెంత వెలసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీఐపీ పర్యటన దృష్ట్యా పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన బేగంపేటలోని కాకతీయ హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “హైదరాబాద్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాను” అని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేక, హింసాత్మక, అరాచక మార్గాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టి రాజ్యాంగ విలువలను కాపాడేందుకే తాను భాగ్యనగరంలో గళమెత్తుతున్నట్లు స్పష్టం చేశారు.
ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు బషీర్‌బాగ్ నిజాం కళాశాల సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించి అమిత్ షా బీజేపీ మహా పాదయాత్రను ప్రారంభిస్తారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ – అరాచక నిర్మూలన’ అనే నినాదంతో సాగే ఈ భారీ పాదయాత్ర మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వరకు కొనసాగుతుంది.
అనంతరం ఎంజే మార్కెట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బహిరంగ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. హోంమంత్రి పర్యటన, పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
