Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన సమావేశం కానుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో ఖర్చులను తగ్గించే పొదుపు చర్యలు, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలే ఎజెండాగా ఈ సమావేశం సాగనుంది.
ప్రస్తుతం ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను తగ్గించడంపై కేబినెట్ ముఖ్యంగా దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా జూన్ 2 నుండి ‘రైతు డిస్కం’ అనే కొత్త విధానాన్ని తేవడంతో పాటు, పొలాల్లో తక్కువ కరెంట్‌తో ఎక్కువ పనిచేసే పంప్సెట్ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అలాగే ఇప్పటికే సక్సెస్ అయిన కొండారెడ్డిపల్లి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాలను ‘సోలార్ విలేజెస్’ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి తోడు మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఇళ్లలో వాడుకునే ‘సోలార్ స్టవ్ స్కీం’ను రాష్ట్రమంతటా విస్తరించడంపై కేబినెట్ ముందడుగు వేయనుంది.
ప్రభుత్వ వృథా ఖర్చులను అరికట్టేందుకు ఈ భేటీలో కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురానున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్, డీజిల్, పెట్రోల్ వాడకాన్ని బాగా తగ్గించడంతో పాటు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఒకే రకమైన పంటలు వేయకుండా, ‘పంటల మార్పిడి’ చేసేలా రైతులకు ఒక సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సీఎం ప్రతిపాదించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా ‘రైతు వేదికల’ పర్యటనలకు సిద్ధమవుతుండటం విశేషం.
ఇక విద్యార్థులకు, పేదలకు మేలు చేసే మరికొన్ని కీలక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదం లభించనుంది. ఇప్పటివరకు ఉన్న పాత పద్ధతిని మార్చి, ఇకపై ‘ఫీజు రీయింబర్స్మెంట్’ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసే కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీనితో పాటు పేద కుటుంబాల కోసం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ నిబంధనలను ఖరారు చేయనున్నారు. అలాగే సొంతింటి కల నిజం చేస్తూ రెండో విడత ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం’ ప్రారంభానికి ఆమోదం తెలపనున్నారు.
చివరగా, జర్నలిస్టులకు మరియు ప్రజాప్రతినిధులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద ఊరట లభించనుంది. ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’లో వీరికి ఇళ్ల స్థలాలు/భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఈరోజే తుది నిర్ణయం తీసుకోనుంది. వీటన్నింటితో పాటు జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి, ఏ మంత్రికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వనున్నారు.
