TG Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే అసెంబ్లీ ప్రాంగణం రాజకీయ రణరంగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యేందుకు యత్నించగా పోలీసులు ప్రధాన ద్వారం వద్ద వారిని అడ్డుకున్నారు. పురుష ప్రజాప్రతినిధులు నల్ల షర్టులు, మహిళా నేతలు నల్ల చీరలు ధరించి నిరసన గళం వినిపిస్తూ గేటు వద్దకు చేరుకున్నారు. అయితే నల్ల దుస్తులతో అసెంబ్లీ లోపలికి ప్రవేశం లేదంటూ భద్రతా సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
చీర లాగేశారు.. మహిళలకు రక్షణ ఏదీ?.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత శృతిమించడంతో పోలీసులు కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ దుమారానికి దారితీశాయి.
