Weather Report

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరికలు!

Weather Report: బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ శనివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత మరింతగా బలపడి ఈ నెల 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపానుగా మారిన తర్వాత రెండు రోజుల్లో ఇది ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు.

ఈ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉండగా, రాగల రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరం వెంబడి సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనున్నందున, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. వాతావరణం కుదుటపడే వరకు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *