Harish Rao

TG Assembly: నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ వినూత్న నిరసన.. చొక్కా విప్పిన హరీశ్‌రావు.. గేటు వద్ద తోపులాట..!

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే శాసనసభ ప్రాంగణం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వినూత్న నిరసనకు దిగింది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ నల్ల రంగు టీషర్టులు ధరించి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర వాగ్వాదం – తోపులాట..

నల్ల టీషర్టులు ధరించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించేందుకు భద్రతా సిబ్బంది నిరాకరించారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తాము ప్రజాప్రతినిధులమని, లోపలికి వెళ్లి తీరాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి పలువురు నేతలు కిందపడిపోయారు. పోలీసుల తీరుపై తీవ్ర మనస్తాపం చెందిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గేటు ముందే కంటతడి పెట్టుకున్నారు.

చొక్కా విప్పి హరీశ్‌రావు నిరసన – కేటీఆర్ సహా నేతల అరెస్ట్

పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు ముందే తన చొక్కా విప్పి ప్రభుత్వ నిర్బంధ కాంక్షపై నిరసన గళమెత్తారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అసెంబ్లీ ప్రారంభం రోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరిగిన ఈ ఘర్షణ వాతావరణం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సభ లోపల, బయట అధికార-ప్రతిపక్షాల మధ్య మరింత వాడీవేడి పోరు తప్పదని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *