Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజైన గురువారమే (మార్చి 13) వాడీవేడిగా సాగుతున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం గురువారం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చ సందర్భంగా సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
Telangana assembly: ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డితో కాంగ్రెస్ సభ్యులు వాదనకు దిగారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యతరాలు వ్యక్తంచేశారు. దానికి ప్రతిగా జగదీశ్‌రెడ్డి గట్టిగానే జవాబిచ్చారు. స్పీకర్, సభ్యుల హక్కులపై సభలో చర్చ జరగాలని జగదీశ్‌రెడ్డి ప్రతివాదనకు దిగారు. ఇది తీవ్రస్థాయిలో దుమారానికి దారితీసింది.
Telangana assembly: తొలుత జగదీశ్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య వార్ నడిచినంత పనైంది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో వాదోపవాదాలు బలంగా వినిపించాయి. ధన్యవాద తీర్మానంపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ పూర్తికాలేదని, రైతుబంధు డబ్బులు పడక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మహిళలకు స్కూటీలు ఇచ్చారా? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి? అని జగదీశ్‌రెడ్డి తొలుత తన ప్రసంగంలో ఎత్తిచూపారు.
Telangana assembly: జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి అడ్డుకొని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెప్పిన పనులేంటో చెప్పాలని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేశారా? మూడెకరాల భూమిని పంచారా? రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మ్యానిఫెస్టోలో రైతులకు చెప్పిందొకటి, చేసింది ఇంకోటి అని చెప్పారు. ఈ ఏడాది పాలనలో తాము చేసినవన్నీ చేశామని, మిగిలిన నాలుగేండ్లలో ఇంకా చేస్తామని చెప్పారు.
Telangana assembly: ఈ దశలో బీఆర్ఎస్ మరో సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ జోక్యం చేసుకున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు కలుగజేసుకోవడం సరికాదని హితవు పలికారు. సభ్యులు పూర్తిగా మాట్లాడాక, నోట్ చేసుకొని తర్వాత వివరణ ఇవ్వాలని సూచించారు. తరచూ మంత్రులు, అధికార సభ్యులు అడ్డుతగిలితే సభ సజావుగా సాగదని చెప్పారు. సభలో సభ్యులందరికీ నిబంధనలు సమానంగా ఉంటాయని, వాటిని పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలను తలసాని ఖండించారు.
Telangana assembly: ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సభ వాయిదా పడింది. అయితే సభలో జగదీశ్‌రెడ్డి తీరు సరిగా లేదంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర అధికార సభ్యులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన ఏకవచనంతో మాట్లాడారని, దానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో జగదీశ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా జగదీశ్‌రెడ్డి తానేమీ తప్పు మాట్లాడలేదని, స్పీకర్, సభ్యుల హక్కులపై ఈ సభలోనే తేలాలని డిమాండ్ చేశారు.