Gajwel

Gajwel: చనిపోదామని దూకితే ప్రాణం పోసిన దుర్గామాత విగ్రహం

Gajwel: ‘మనిషికి భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉంటే.. ఎంతటి మృత్యువు ముంగిట నుంచైనా ప్రాణాలతో బయటపడతారు’ అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఇలాంటి వింతైన ఘటనే సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వాగులోకి దూకిన ఓ మహిళ.. నీటిలో నిమజ్జనం చేసి ఉన్న దుర్గామాత విగ్రహం స్టాండ్ ఆధారంతో ప్రాణాలతో బయటపడింది.

సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట పరిధిలోని హల్దీ వాగు చెక్ డ్యామ్ వద్ద ఈ ఘటన జరిగింది. గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన చీర్ల బాలమణి (50) గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి, నాచారంగుట్ట వద్ద ఉన్న హల్దీ వాగు చెక్ డ్యామ్‌లోకి ఒక్కసారిగా దూకేసింది.
అయితే ఆమె దూకిన చోటే అంతకుముందు నిమజ్జనం చేసిన దుర్గామాత విగ్రహానికి సంబంధించిన ఇనుప స్టాండ్ నీటిలో ఉంది. దూకిన వెంటనే ఆ స్టాండ్ ఆమె చేతికి తగలడంతో, ప్రాణభయంతో ఆమె దానిని గట్టిగా పట్టుకుంది. దాంతో నీటిలో మునిగిపోకుండా పైకి తేలుతూ స్థానికుల కంటపడింది. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని పోలీస్ చెక్‌పోస్ట్‌లో ఉన్న కానిస్టేబుల్ విష్ణుకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో కానిస్టేబుల్ ఆమెను సురక్షితంగా నీటిలో నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం సమాచారం అందుకున్న బాలమణి కుమారుడు, అల్లుడు అక్కడికి చేరుకుని ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *