Telangana: సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మహానగరం దాదాపు ఖాళీ అయినంత పనైంది. రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. నగరంలో నివాసం ఉండే వారిలో సుమారు 70 శాతం మంది సొంతూళ్లకు వెళ్లారన్నది అంచనా. మరీ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిలో 90 శాతం వెళ్లి ఉంటారని సమాచారం. దీంతో హైదరాబాద్-విజయవాడ, నార్కట్పల్లి-అంద్దంకి, హైదరాబాద్-మాచర్ల, ఖమ్మం-హైదరాబాద్ రూట్లలో వెళ్లిన వారు శని, ఆది, సోమవారాల్లో పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణం అవుతారు.
Telangana: ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చే ప్రయాణికులంతా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందని, ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని వాహనదారులు కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు.
దారిమళ్లింపు వివరాలు ఇవే..
1) గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు: గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలి.
2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు: మాచర్ల నుంచి నాగార్జున సాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ నగరానికి చేరుకోవాలి.
3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు: నల్లగొండ నుంచి మర్రిగూడ బైపాస్ మీదుగా మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ (జాతీయ రహదారి 65) మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి.
4) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు: సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి.
5) జాతీయ రహదారి-65 (విజయవాడ-హైదరాబాద్)పై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతాయని పోలీసులు తెలిపారు. అందుకే చిట్యాల నుంచి భువనగిరి గుండా హైదరాబాద్కు వాహనాలను దారి మళ్లించనున్నట్టు తెలిపారు. వాహనాల దారి మళ్లించడంతో జాతీయ రహదారి-65పై ట్రాఫిక్ తీవ్రత తగ్గుతుందని, ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని పోలీస్ అధికారులు తెలిపారు.
