Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లాల వారీగా వర్ష హెచ్చరికలు – అలర్ట్‌లు..
-
ఆరెంజ్ అలర్ట్ (అతి భారీ వర్షాలు):ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
-
ఎల్లో అలర్ట్ (భారీ వర్షాలు):నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
-
రేపటి సూచన (సెప్టెంబర్ 13):ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు:హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
నమోదైన వర్షపాతం:
ఇప్పటికే ఉదయం నుంచి పలుచోట్ల ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది.. చిర్యాల పరిధిలోని కన్నెపల్లిలో అత్యధికంగా 13 సెం.మీ. అతిభారీ వర్షపాతం నమోదైంది. వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 9 సెం.మీ. మేర భారీ వర్షపాతం రికార్డయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు:
ఈ అల్పపీడన ప్రభావం ఏపీపైనా తీవ్రంగా ఉంది:
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు: ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తాలో 40-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు: కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.
