Train Accident: పంజాబ్లోని పటియాలా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం పెను రైలు ప్రమాదం తప్పింది. అమృత్సర్ – న్యూ జల్పాయ్గుడి మధ్య నడిచే కర్మభూమి ఎక్స్ప్రెస్ (రైలు నం. 12508) లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్పురాకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరాయ్ బంజారా – బసంత్పురా రైల్వే స్టేషన్ల సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక బోగీలో మంటలు చెలరేగాయి.
క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కనున్న ఇతర బోగీలకు వ్యాపించాయి. ఇంజిన్ వైపు నుంచి ఐదో బోగీలో మొదలైన అగ్ని కీలలు దాదాపు 3 నుంచి 4 బోగీలను చుట్టుముట్టడంతో బోగీల నుంచి దట్టమైన పొగ, మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయగా, భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సకాలంలో కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయాలు కానీ జరగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రతా సిబ్బంది, అగ్నిమాపక దళాలు, ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక బోగీలోని సీలింగ్ ఫ్యాన్లో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చని జీఆర్పీ ఎస్హెచ్ఓ గుర్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై రైల్వే శాఖ సాంకేతిక విచారణ చేపట్టింది. బాధితులైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
