Telangana: తెలంగాణ రైతుల కండ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. దీపావళి వారిండ్లలో వెలుగులు నింపుతుందనుకుంటే కటిక చీకట్లు ఇంకా తొలగనేలేదు. వివిధ జిల్లాల్లో అకాల వర్షానికి మార్కెట్లలో అమ్మాకానికి రైతులు తెచ్చిన ధాన్యం, పత్తి కాంటాలు కాలేదు. దీంతో బుధవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయి రైతులకు తీవ్ర నష్టాల పాలయ్యారు. జనగామ, వరంగల్, ఖమ్మం మార్కెట్లలో ఉంచిన పత్తి, వానకాలం వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి.
Telangana: జనగామలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. చిన్నపాటి మోటర్ పెట్టి ఆ నీటిని తోడేయాల్సి వచ్చింది. అయినా నీటిలోనే ధాన్యం నానుతూ ఉన్నది. పండుగ పూటయినా పస్తులుండి మరీ తమ ధాన్యాన్ని కాపాడుకునే పనిలోనే ఉండాల్సి వచ్చింది.
Telangana: ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో సకాలంలో కాంటాలు కాకపోవడంతో ఆరుబయట బస్తాల్లో ఉన్న పత్తి పూర్తిగా తడిసి ముద్దయింది. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల జాప్యం కారణంగా రైతులు నిండి మునిగారు. తీవ్ర నష్టాల పాలయ్యారు. దీపావళి పర్వదినం వెలుగులు నింపుతుందనుకుంటే చీకట్లలోనే మగ్గాల్సి వచ్చిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.