TDP Mahanadu 2025:ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో మహానాడు ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. కడప గడపలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా సాగుతోంది. 2024 ఎన్నికల విజయం అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న ఈ మహానాడు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో ప్రాంగణం జన సంద్రంగా మారింది. తొలి రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తుండగా, చివరి రోజు బహిరంగ సభ జరగనుంది. వర్ష భీతి దృష్ట్యా భారీ జర్మన్ హ్యాంగర్ ఏర్పాట్లు చేశారు. పార్టీలోని విజయాలను చూపే ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంటోంది. చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌లో ఐసీయూ సహా అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.