TANA Conference: తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) 24వ మహాసభలు జూలై నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి రెండేండ్లకోసారి జరిగే మహాసభలు ఈ సారి 2025 జూలై నెలలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి. అమెరికాలోని మిచిగాన్‌లోని నోవిలో తానా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లలో మునిగిపోయారు.
ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజల సమాచార, సంబంధం బాంధవ్యాల కోసం ఈ తానా అసోసియేషన్ ఒక వేదికగా పనిచేస్తూ వస్తున్నది. తానా మహాసభలకు అమెరికాలోని నలుమూలల నుంచి తెలుగు వారితో పాటు అమెరికా, భారతదేశంలోని వివిధ రాజకీయ ప్రముకులు, సినీ తారలు సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు.
తానా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది తెలుగు ప్రజలందరికీ వేదికగా పనిచేస్తున్నది. తెలుగు ప్రజలందరినీ ఒకచోటుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే తానా 24వ మహాసభలు ఈసారి మిచిగాన్‌లో జరగనున్నాయి.
అమెరికాలోనే అతి పెద్దదైన ఈ తానా తెలుగుదనానికి నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈసారి జరిగే తానా 24వ మహాసభలకు తరతరాల తెలుగుదనం-తరలివచ్చే యువతరం.. అనే నినాదంతో ముందుకు సాగుతున్నది. తానా సభలు ప్రపంచంలోని తెలుగు సమాజాన్ని ఎంతగానో ఆకర్షిస్తుంటుంది.
తానా మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కే రఘురామకృష్ణంరాజు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ వేడుకలకు ఆహ్వానించారు.
టాలీవుడ్‌లో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, నటుడు నిఖిల్, యాంకర్ సుమ, దర్శకుడు రాఘవేందర్‌రావు, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, గాయని గాయకులు చిత్ర, సునీత, ఎస్పీబీ చరణ్, శ్రీ కృష్ణ, సింహా, గాయని శోభారాజు, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
మీడియా రంగం నుంచి మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణ సహా పలువురు ప్రముఖులను తానా నిర్వాహకులు ఆహ్వానించారు. ఈనాడు ఎండీ కిరణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెల్లాలచెరువు, తెలుగు వన్ చైర్మన్ రవిశంకర్ కాటమనేని తదితరులకు తానా నిర్వాహకులు ఆహ్వానం పలికారు.