Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని పాలకీడు మండలం జాన్‌పహాడ్ దర్గాలో శుక్రవారం (జనవరి 23) ఉర్సు ప్రారంభమైంది. ఉర్సు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Suryapet: మంత్రి, ఇతర అతిథులకు జాన్‌పహాడ్ ముజావర్ సయ్యద్ జానీ, ముజావర్, మైనార్టీ విభాగం నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సైదా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, గంధం దట్టీలు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున గంధం ఉరేగింపును ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో ఉర్సు జరుపుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
Suryapet: ఉర్సులో భాగంగా దర్గాలోని సైదులు బాబాను పెండ్లికొడుకుగా అలంకరించారు. కొవ్వొత్తుల, హారతులతో గంధం ఊరేగించారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణలోని పుట్టల్లో భక్తులు పెద్ద ఎత్తున పాలు, గుడ్లు ఉంచి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. భక్తిశ్రద్ధలతో మహిళలు పానసారాలు పట్టారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన పువ్వులు, దట్టీలను సైదులు, ఇతర సమాధులపై ఉంచి ప్రార్థనలు చేశారు.
Suryapet: జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సులో కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవానికి సుమారు 600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. దర్గా పరిసరాల్లో యాటలు, కోళ్లు కోసి అక్కడే వంటలు చేసుకొని భక్తులు భోజనాలు చేశారు.
