Supreme Court

Supreme Court: రికార్డులు కనిపించకపోవడమేంటి? మీ పని ఎన్నికలు నిర్వహించడమే కదా!

Supreme Court: కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 2023 సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు వీడియో ఫుటేజీ రికార్డులు కనిపించకుండా పోయాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చెప్పిన సమాధానంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ ఇంతటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అందుబాటులో ఉన్న రికార్డులను సమర్పించకపోతే ఈసీకి వ్యతిరేకంగానే ప్రతికూల ఉత్తర్వులు (Adverse Inference) జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్నికల రికార్డులు భద్రపరచాల్సిన బాధ్యత కలిగిన సంస్థ.. ఇలాంటి “కుంటిసాకులు” చెబితే కోర్టు ఏమాత్రం ఉపేక్షించబోదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఇలాంటి కుంటిసాకులను కోర్టు అంగీకరించదు.. ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. 2023 నాటి అసలైన కౌంటింగ్‌కు సంబంధించిన ఒరిజినల్ వీడియో రికార్డింగ్ దొరకడం లేదని, దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని కోర్టుకు తెలిపారు.
దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే మీ ప్రధాన విధి. అలాంటప్పుడు కీలకమైన ఎన్నికల పత్రాలు, వీడియో రికార్డులు మీ దగ్గర ఉండాలి కదా? ‘మేము వెతుకుతున్నాం’ అని అసహాయత వ్యక్తం చేయడం ఏంటి? రికార్డులపై మీకు కనీస కస్టడీ లేదా? గెలిచిన అభ్యర్థికే అన్ని ఇచ్చేస్తారా?” అంటూ ఈసీ తీరును నిలదీసింది.
వచ్చే విచారణ నాటికి అన్ని వివరాలు పెట్టాల్సిందే..
మీ దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ తదుపరి విచారణ నాటికి న్యాయస్థానం ముందు ఉంచండి. లేకపోతే ఈసీ ఉద్దేశపూర్వకంగానే దాస్తోందన్న నిర్ధారణకు వచ్చి మీపై ప్రతికూల ఉత్తర్వులు ఇస్తాం. ఇలాంటి కుంటిసాకులను న్యాయస్థానం ఏమాత్రం అంగీకరించదు అని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 15, 2027కి వాయిదా వేసింది.
వివాదం నేపథ్యం: శృంగేరి పోస్టల్ బ్యాలెట్ల రగడ
ఈ వివాదం మూలాలు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉన్నాయి.. శృంగేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత టి.డి. రాజేగౌడ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత డి.ఎన్. జీవరాజ్‌పై 201 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
హైకోర్టు ఆదేశాలతో రీకౌంటింగ్
ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత జీవరాజ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరణకు గురైన 279 పోస్టల్ బ్యాలెట్లను పునఃపరిశీలించి, రీకౌంటింగ్ చేపట్టాలని ఏప్రిల్ 2026లో హైకోర్టు ఆదేశించింది.
పరిధి దాటిన రిటర్నింగ్ అధికారి?..
అయితే హైకోర్టు ఇచ్చిన పరిధిని దాటి.. రిటర్నింగ్ అధికారి గతంలోనే చెల్లుబాటైన (Valid) 1,251 పోస్టల్ బ్యాలెట్లను కూడా మళ్లీ ఓపెన్ చేసి తనిఖీ చేశారు. ఈ రీకౌంటింగ్‌లో రాజేగౌడకు వచ్చిన 255 ఓట్లను చెల్లవంటూ కొట్టివేసి, జీవరాజ్‌కు 2 అదనపు ఓట్లు కలపడంతో బీజేపీ అభ్యర్థి 52 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ప్రకటించారు.
సుప్రీంకోర్టు స్టే..
రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మే నెలలోనే సుప్రీంకోర్టు ఈ చర్యలపై స్టే విధించి, ఎమ్మెల్యేగా రాజేగౌడను కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఆనాటి అసలైన కౌంటింగ్, రీకౌంటింగ్ వీడియో రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
వీడియో ఫుటేజీ ఎందుకు కీలకం?..
పోస్టల్ బ్యాలెట్ల రీకౌంటింగ్ సమయంలో తీవ్ర అవకతవకలు జరిగాయని, బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేశారని ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో అసలైన కౌంటింగ్ రోజు ఏం జరిగిందో తేల్చడానికి వీడియో ఫుటేజీ అత్యంత కీలక ఆధారంగా మారింది. అలాంటి రికార్డులే గల్లంతయ్యాయని ఈసీ చెప్పడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *