TTD – ED: టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ పంజా.. రూ.234.5 కోట్ల భారీ స్కామ్..!

TTD – ED: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం భారీ ఆపరేషన్ చేపట్టి.. నిందితులకు చెందిన రూ. 129.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ (జప్తు) చేసింది.

ఈ తాజా జప్తుతో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో స్తంభింపజేసిన, స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ. 132.55 కోట్లకు చేరినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది. టీటీడీకి నేరుగా, మధ్యవర్తి డెయిరీల ద్వారా ఏకంగా రూ. 234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు విచారణలో ఆధారాలు లభించాయి.
జప్తు చేసిన ఆస్తులు – కీలక నిందితుల వివరాలు..
ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ప్రధాన నిందితులు, ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల సంస్థలు ఉన్నాయి..
  • డెయిరీ సంస్థలు: భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
  • అరెస్టయిన ప్రమోటర్లు: భోలే బాబా సంస్థ ప్రమోటర్ విపిన్ జైన్, సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ & డైరెక్టర్ కైలాశ్ చంద్ మంగ్లాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. పొమిల్ జైన్‌తో పాటు మరికొందరిపై కూడా చర్యలు తీసుకున్నారు.
  • 2019 నుంచి 2024 మధ్య దందా: 2019-2024 మధ్య కాలంలో టీటీడీ టెండర్లలో ఇతర కంపెనీలను కమిషన్ ప్రాతిపదికన మధ్యవర్తులుగా రంగంలోకి దించి, వాస్తవానికి భోలే బాబా, సుకృతి ఫుడ్స్ కేంద్రాల్లోనే కల్తీ నెయ్యిని తయారు చేసి సరఫరా చేసినట్లు తేలింది.

పామాయిల్, కెమికల్స్‌తో నకిలీ నెయ్యి – బయటపడ్డ షాకింగ్ నిజాలు..

స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా నమ్మించేందుకు నిందితులు ప్రమాదకరమైన రసాయనాలు, నూనెలను వాడినట్లు ఈడీ ఫోరెన్సిక్ దర్యాప్తులో నిర్ధారణ అయింది.
  • కల్తీకి వాడిన పదార్థాలు: రిఫైండ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ నూనెలను బేస్ కింద వాడారు.
  • కెమికల్స్ మిక్సింగ్: వీటికి మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్స్, లాక్టిక్ యాసిడ్, పసుపు రంగు వాసన కోసం బీటా-కెరోటిన్ వంటి కెమికల్స్ కలిపి అచ్చం ఆవు నెయ్యిలా మార్చారు. ఇన్‌వాయిస్‌లలో వీటిని కేవలం సాధారణ తినదగిన నూనెలుగా (Edible oils) పేర్కొన్నారు.
  • బోగస్ లావాదేవీలు: రికార్డుల్లో అసలైన డెయిరీ కార్యకలాపాలు జరుగుతున్నట్లు చూపించేందుకు.. పెద్ద ఎత్తున పాలు, నెయ్యి కొనుగోలు చేసినట్లు, స్కిమ్డ్ మిల్క్ విక్రయించినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు.

హవాలా మార్గాలు – కమీషన్ల పంపకం..

  • నకిలీ కొనుగోళ్ల కోసం కంపెనీలు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చెల్లించిన కోట్ల రూపాయలను తిరిగి హవాలా మార్గాల్లో నగదు రూపంలో డ్రా చేసుకున్నారు.
  • ఈ బ్లాక్ మనీని నకిలీ పామాయిల్ వ్యాపారులకు చెల్లించడానికి, టెండర్లలో పాల్గొన్న బినామీ డెయిరీలకు కమీషన్లు ఇవ్వడానికి, సహకరించిన వ్యక్తులకు లంచాలు పంచడానికి ఉపయోగించారు.

దేశవ్యాప్తంగా 16 చోట్ల సోదాలు – తిరుపతి ఎఫ్‌ఐఆర్‌తో దర్యాప్తు..

  • తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్, నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలైన చార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ కింద రంగంలోకి దిగింది.
  • జూన్ 3న దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌లలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో రూ. 2.7 కోట్ల నగదు, బ్యాంక్ డిపాజిట్లను స్వాధీనం చేసుకుంది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మరికొన్ని ఫ్రంట్ కంపెనీలు, ఇతర వ్యక్తుల పాత్రపై ఈడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *