Danam Nagender: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, దానిపై ఎలాంటి స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది (డిస్మిస్ చేసింది). హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో దానం శాసనసభ సభ్యత్వం రద్దు కావడం ఖరారైంది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ గుర్తుపై గెలుపు – కాంగ్రెస్‌లో చేరిక..
2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, అనంతరం ఆయన అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు – ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వేడి..
హైకోర్టు ఆదేశాలపై వెంటనే స్టే విధించాలని కోరుతూ దానం నాగేందర్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం, ప్రజా తీర్పు కోరుకోవాలనుకుంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఈ పరిణామంతో ఖైరతాబాద్ స్థానం అధికారికంగా ఖాళీ అయినట్లయింది. మరోవైపు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
