Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్టల్‌లోనే ఉంటుంది. తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో మాత్రం స్వాతి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థులు సిబ్బందికి తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులకూ సమాచారం అందించారు.
Basara IIIT: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాతి ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏడాదిలో రెండు మూడుసార్లు ఇలాంటి ఘటనలు ఈ రెండేళ్లలో ఎక్కువ అవుతున్నాయని పేర్కొన్నారు.