Srikanth Odela

Srikanth Odela: కార్తీక్ సుబ్బరాజ్ ఎంట్రీతో.. చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల మూవీ ఆగిపోయిందా..?

Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, అందరి దృష్టి ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల తర్వాతి ప్రాజెక్ట్‌పై పడింది. శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయాల్సి ఉండగా, దానికి స్వయంగా నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ విడుదలైన తర్వాత మొదటిసారి నాని ఈ సినిమా ఫలితంపై, చిరంజీవి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై అయన చెప్పారు.
‘ది ప్యారడైజ్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?
సినిమా అనుకున్నంతగా ఆడకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నాని నిజాయితీగా కొన్ని విషయాలను ఒప్పుకున్నారు.  షూటింగ్ సమయంలో ఎదురైన లాజిస్టిక్ ఇబ్బందుల వల్లే ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైందని, అదే సినిమా రిజల్ట్‌ను దెబ్బతీసిందని నాని చెప్పారు. ‘ది ప్యారడైజ్’ కచ్చితంగా ఇంతకంటే చాలా బెటర్‌గా రావాల్సిన సినిమా అని నాని అంగీకరించారు.

 

అది కాక దసరా సినిమా తర్వాత మేమిద్దరం కలిసి ఇంకో సినిమా చేస్తున్నాం అని బయటకు రావడంతో శ్రీకాంత్ పై కొంత ఒత్తిడి పడింది.. తాను హైప్ కి పోకుండా కేవలం కథ పైనే ఫోకస్ పెట్టుంటే సినిమా ఇంకో రేంజ్ లో వచ్చేది అని చెప్పారు.

ఈ సినిమాతో తాము ఒక బలమైన పాఠం నేర్చుకున్నామని నాని స్పష్టం చేశారు. ఒక సినిమా పూర్తి కావడానికి 3 ఏళ్లు పట్టినా లేక 5 ఏళ్లు పట్టినా పర్లేదు కానీ… ఆ సమయాన్ని ప్రీ-ప్రొడక్షన్ లేదా పోస్ట్-ప్రొడక్షన్‌పై మాత్రమే పెట్టాలని, షూటింగ్ దశలో అంత ఎక్కువ సమయం తీసుకోకూడదని ఆయన అన్నారు.
శ్రీకాంత్ టాలెంట్‌పై నానికి పూర్తి నమ్మకం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తనకున్న స్నేహం, బంధం ఏమాత్రం మారలేదని నాని క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ మైండ్‌లో అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని, అతని టాలెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. శ్రీకాంత్ ఖచ్చితంగా తన తర్వాతి సినిమాతో  బలంగా పుంజుకుంటాడని (బౌన్స్ బ్యాక్) ధీమా వ్యక్తం చేశారు.
నేను శ్రీకాంత్ గురించి ఇలా చెప్పడం ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అతను చేసే సినిమాలు చూశాక నా మాటకు ఉన్న విలువేంటో అందరికీ అర్థమవుతుంది  అని నాని కొనియాడారు. భవిష్యత్తులో శ్రీకాంత్‌తో మళ్లీ కలిసి పనిచేస్తానని కూడా నాని స్పష్టం చేశారు.
చిరంజీవి సినిమా పరిస్థితి ఏంటి?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవితో ప్లాన్ చేసిన సినిమా ప్రస్తుతానికి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై నాని మాట్లాడుతూ. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో, చిరంజీవి గారు వేరే కమిట్‌మెంట్స్, ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోయారని చెప్పారు. ప్యారడైజ్ రిలీజ్ తర్వాత తాను ఇంకా చిరంజీవి గారిని కలవలేదని, త్వరలోనే ఇద్దరం కలిసి మాట్లాడిన తర్వాత ఈ సినిమా షెడ్యూల్స్‌పై పూర్తి క్లారిటీ వస్తుందని నాని వెల్లడించారు.
రేసులోకి కార్తీక్ సుబ్బరాజ్?
ఈ విషయాలు బయటకు రాగానే సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవల ‘డొరొతీ’ (Dorothy) సినిమాతో హిట్ కొట్టిన కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక అదిరిపోయే కథ వినిపించారని టాక్. ఆ స్టోరీ లైన్‌పై చిరంజీవి కూడా చాలా పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది.
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడు తన డేట్స్‌ను శ్రీకాంత్ ఓదెల సినిమాకు ముందుగా కేటాయిస్తారా? లేక కార్తీక్ సుబ్బరాజ్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకొస్తారా? అన్నది టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే నాని-చిరంజీవి భేటీ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *